పెళ్లి వయసు వచ్చిన యువతీ, యువకులను పెళ్లెప్పుడు అని అడగడం సహజం. అదే సెలబ్రిటీలైతే ఇక చెప్పేదేముంది. ఆ హీరో ఫలానా నటితో డేటింగ్‌లో ఉన్నాడనో, హీరోయిన్ అయితే ఫలానా హీరోతో లేదా వ్యాపారితో లేదా ఫలానా ప్రముఖ క్రీడాకారుడితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోందని సోషల్ మీడియాలో గ్యాసిప్స్ తెగ వైరల్ అవుతుంటాయి.
ఇక జేజమ్మ అనుష్క పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అనుష్కకు సోషల్ మీడియా మళ్లీమళ్లీ పెళ్లి చేస్తూనే ఉంది. అనుష్క సినిమాల కంటే ఆమె పెళ్లిపైనే ఎక్కువ ప్రచారం జరిగిన, జరుగుతున్న మాట నిజం. యంగ్ రెబల్ స్టార్ , బాహుబలి ప్రభాస్‌తో పెళ్లే ఇక మిగిలిందని కొన్నాళ్ల పాటు విస్తృత ప్రచారం జరిగింది. వాళ్లిద్దరు ఆ వార్తలను ఖండించడంతో ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది.
మళ్లీ అనుష్క పెళ్లి గురించి చర్చ మొదలైంది. ‘నిను వీడని నీడను నేను’ అన్న చందంగా అనుష్కను పెళ్లి వ్యవహారం నీడలా వెంటాడుతూనే ఉంది. నార్త్ ఇండియన్ క్రికెటర్‌తో అనుష్క ప్రేమాయనం సాగిస్తోందని, వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా పెద్ద ఎత్తన ప్రచారం సాగింది. ఇదెక్కడి గొడవరా బాబు అనుకున్న అనుష్క దాన్ని కూడా ఖండించింది.
తాజాగా టాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుష్క మళ్లీ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకు రావాల్సి వచ్చింది.
తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై ఆమె విసుగెత్తిపోయింది. దీంతో ఈ దఫా ఆమె గట్టిగానే రియాక్ట్ అయ్యింది.
‘కొంత కాలంగా నా పెళ్లిపై సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. అసలు అలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో కూడా తెలియడం లేదు. కానీ వాటిల్లో ఎంత మాత్రం నిజం లేదు. అయినా నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. దాన్ని రహస్యంగా ఎందుకు పెడతా? పెళ్లి జరిగిన రోజు తప్పకుండా ప్రజలకు తెలుస్తుంది’ అని అనుష్క ఓ స్పష్టత ఇచ్చింది.