డేటింగ్ అంటారు. సహజీవనం అంటారు. తమ మధ్య రిలేషన్‌షిప్‌నకు ఏవేవో కొత్తకొత్త పేర్లు పెడతారు. అక్కడ, ఇక్కడ…వీలున్న చోటికల్లా యథేచ్ఛగా తిరుగుతారు. తమ మధ్య ప్రేమ ఉన్నంత వరకు…ప్రేమపై ఎన్నెన్నో కబుర్లు చెబుతారు. ఆ తర్వాత మోజు తీరిపోయి….ఎవరి దారి వారు చూసుకున్న తర్వాత మోసపోయామని మొసలి కన్నీళ్లు కారుస్తారు. ఇలాంటి ప్రేమలు, పెటాకులు, ఏడుపులు, పెడబొబ్బల గురించి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు.
సరిగ్గా ఇలాంటి కోవకు చెందిందే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే ప్రేమ వ్యవహారం. గతం గురించి గుర్తు చేసుకోకుండా ఆమె ఏమీ మాట్లాడరు. తాజాగా ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత ప్రేమ, మోసపోవడం గురించి చెప్పుకొచ్చారు.
‘స్త్రీ, పురుష మధ్య సంబంధాలంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. శృంగారం అంటే శరీరానికి సబంధించింది మాత్రమే కాదు. అది మనసుకు, భావోద్వేగాలతో కూడుకున్నది. తెలివి తక్కువ దానిలా అతనికి రెండో అవకాశం ఇచ్చాను. ఎందుకంటే అతను నన్ను వేడుకున్నాడు. నా చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం నన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇంకా అతను నన్ను మోసం చేస్తున్నాడని. అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. అయితే ఎంతో నమ్మి మోసపోవడంతో, ఆ సంఘటన నుంచి బయటికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక, మళ్లీ వెనక్కి వెళ్లడానికి కుదరదు. జీవిత ప్రయాణంలో ముందుకు పోవాల్సిందే కదా. అదే నేను చేస్తున్నా’ అని దీపికా చెప్పుకొచ్చారు.
ఇంకా తాను ప్రేమించిన వాడి చేతిలో ఎలా వంచనకు గురైందో దీపికా కథలుకథలుగా చెప్పింది. వాటికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
‘అతను నన్ను మోసం చేసిన మొదటిసారి, బంధంలోనో, లేదా నాలో లోపం ఉందని అనుకున్నాను. కాని ఎవరైనా మోసాన్ని అలవాటుగా చేసుకున్నప్పుడు, అతనే సమస్య అని తెలిసి పోతుంది. నేను రిలేషన్‌లోషిప్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. తిరిగి ప్రతిఫలంగా ఆశించను. కానీ ఒక్కసారి రిలేషన్‌షిప్‌లో మోసం చేస్తే.. గౌరవం పోతుంది, బంధానికి ఉన్న నమ్మకం పోతుంది. అతనితో కలిసి ఉండలేం అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది’ అని వివరించారామె.
హీరో రణ్‌బీర్ కపూర్‌తో దీపికా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దీపిక.. రణ్‌బీర్ రెండేళ్లపాటు డేటింగ్ చేసి, అనంతరం 2009లో విడిపోయారు. వాళ్లిద్దరూ విడిపోయినప్పటికీ, రణబీర్‌కపూర్ చేతిలో మోసపోయాననే బాధ ఆమె మనసును దహించివేస్తోంది. దీనికి ఆమె పదేపదే గుర్తు చేసే పాత విషయాలు నిదర్శనం. ఏవైనా ఒకట్రెండు సార్లు చెబితే జాలి చూపుతారు. కానీ చెప్పిన విషయాన్ని పదేపదే చెబుతుంటే , వినేవాళ్లు విసిగెత్తి పోవడం మాత్రం ఖాయం.