మమ్మల్ని పోటీచేయనివ్వడం లేదు.. బెదిరిస్తున్నారు.. దాడులు చేస్తున్నారు.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చాలా రోజులుగా.., వైకాపా మీద బురద చల్లే యజ్ఞం చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు.. ప్రత్యేకించి స్థానిక ఎన్నికలు అన్న తరువాత.. కొన్ని ప్రాంతాల్లో అయినా చెదురుమదురు ఘటనలు జరగడం సహజం.
అయితే.. వాటిని భూతద్దంలో చూపెడుతూ.. వ్యక్తిగత విద్వేషాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జరిగే ఘర్షణలను పార్టీలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి తెలుగుదేశం శతథా ప్రయత్నిస్తూనే వస్తోంది. నిజానికి వారికి చాలా చోట్ల అభ్యర్థులను పెట్టుకునేందుకు కూడా గతిలేని స్థితి ఉంది. అభ్యర్థులు దొరికినా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవబోం అనే నమ్మకం కూడా వారిలో పలువురికి ఉంది. ఆ ప్రభావమే తాజాగా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాటల్లో కూడా కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి ఎంత గట్టి నాయకుడో అందరికీ తెలిసిన సంగతే. ఫ్యాక్షన్ లకు నిలయమైన కర్నూలు జిల్లాలో.. కేఈ కృష్ణమూర్తి.. తన ముద్రతో తెలుగుదేశం రాజకీయాలను ముందుకు తీసుకువెళుతూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు అక్కడ కూడా రాజకీయం మారింది. ఆయన వయోభారంతో మునుపటిలా రాజకీయం చేయలేకపోతున్నారు. స్వయంగా తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఆయన తమ్ముడు కెఇ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి ఏకంగా రాజీనామా చేసేశారు. ఆయన వైకాపాలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో.. అసలు డోన్ లో తెదేపా పూర్తిగా చేతులెత్తేసింది. కనీసం వారికి మునిసిపాలిటీ వార్డలకు కౌన్సిలరు అభ్యర్థులను వెతికి పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎవరైనా పోటీకి ముందుకొచ్చినా గెలుపు గ్యారంటీ లేదని అర్థమైపోయింది.
దాంతో కెఇ కృష్ణమూర్తి.. బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి డోన్ మునిసిపాలిటీని దానంగా ఇస్తున్నాం అంటూ దాతృత్వ ప్రకటన చేశారు. మునిసిపాలిటీలో అసలు పోటీ చేయకూడదని నిర్ణయించారు. బీసీ అభ్యర్థులపై వైకాపా దాడులకు పాల్పడుతోందని పాత రికార్డు వేశారు. పోటీ చేయడానికి ధైర్యం లేక.. మునిసిపాలిటీ దానం చేస్తున్నామనే ప్రకటన చూసి ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు.