కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటాయి. మరిచి పోవాలని ఎంత ప్రయత్నించినా…ఊహూ, సాధ్యం కాదు. ఎందుకంటే జ్ఞాపకాలకున్న శక్తి అలాంటిది మరి. మరీ ముఖ్యంగా వివాహ ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. పెళ్లికి సంబంధించి తొలి రోజుల్లో ప్రతిదీ హృదయంపై చెరగని ముద్ర వేసుకుంటుంది. అందువల్లే పెళ్లైన తొలి రోజులకు సంబంధించి ప్రతి అనుభూతి నిత్యనూతనంగా మనసును గిలగింతలు పెడుతూ ఉంటుంది.
బాలీవుడ్ హీరోయిన్, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన జ్ఞాపకాల గురించి నెమరు వేసుకుంటుండం అందులో భాగమే. తమ పెళ్లి తర్వాత మొదటి ఆరు నెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే కలిసి గడిపామని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా “వోగ్” మ్యాగ్జైన్ కవర్ పేజీపై అనుష్క శర్మ మెరిశారు. తన వైవాహిక జీవితం గురించి ఆమె గుర్తు చేశారు.
” అవును.. నేను రోజులు లెక్క పెట్టేదాన్ని. మా ఇద్దరిలో ఎవరో ఒకరం వర్క్‌తో బిజీగా ఉండేవారం. విరాట్‌ను కలిసేందుకు విదేశాలకు వెళ్లేదాన్ని. అక్కడ భోజనం కోసం బయటకు వెళ్లే సమయాన్ని బాగా ఆస్వాదించేవాళ్లం. పెళ్లైన ఆరు నెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నాం. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇద్దరం కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నాం” అని అనుష్క తెలిపారు.