సోషల్ మీడియాలోని ఇన్‌స్టాగ్రామ్‌తో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సిస్టర్స్ గొడవకు ఓ వార్నింగ్ కారణమైంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ పరిస్థితులపై రకరకాల చర్చలు…చివరికి రచ్చలకు దారి తీశాయి.
తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకొంది. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ స్టార్ వారసులపై నెటిజన్ల ఆగ్రహానికి దారి తీసింది. అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నెటిజన్ల విమర్శలకు గురైంది. నెటిజన్ల విమర్శలు, ఆగ్రహాన్ని తట్టుకోలేక సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌ను కంట్రోల్ చేసింది. అంతేకాదు, సోనమ్ సోదరి రియా కపూర్ సోషల్ మీడియా ఖాతాలకు బెదిరింపులు రాసాగాయి.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌కు కాస్తా ఆవేశం ఎక్కువై చంపేస్తామంటూ కామెంట్ పెట్టాడు. ఆ బెదిరింపు కామెంట్‌ను ఇన్‌స్టా నుంచి తొలగించాలని రియా సంబంధిత సోషల్ మీడియా టీంను కోరింది.
రియా స్పందనపై ఇన్‌స్టాగ్రామ్ టీం స్పందిస్తూ…ఆ కామెంట్ తమ రూల్స్‌కు వ్యతిరేకంగా లేదని, దాన్ని తొలగించడం కుదరదని సమాధానం ఇచ్చింది. కావాలంటే సదరు నెటిజన్‌ను బ్లాక్ చేసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ టీం ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఇన్‌స్టా టీం స్పందన రియాకు సహజంగానే కోపం తెప్పించింది.
తనను వార్న్ చేస్తూ పెట్టిన కామెంట్‌ను ఆమె స్క్రీన్ షాట్ తీసి, దాన్ని షేర్ చేసిన రియా.. “కచ్చితంగా నేను ఆ వ్యక్తిని బ్లాక్ చేస్తాను. అయితే ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీని సురక్షితంగా ఉంచేందుకు మీరేం చర్యలూ తీసుకోరా” అని ప్రశ్నించింది.
ఈ గొడవను ఫాలో అవుతున్న రియా సోదరి సోనమ్ స్పందిస్తూ.. “చంపేస్తామనే బెదిరింపులు సమంజసమేనని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోందా? లేదా ఇన్‌స్టాగ్రామ్ ఇండియా టీమ్‌కు హిందీ చదవడం రాదా?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. మొత్తానికి ఓ నెటిజన్ దుందుడుకు కామెంట్ చినికి చినికి గాలివానగా మారిన చందంగా సోషల్ మీడియా వర్షెస్ సోనమ్ సిస్టర్స్ అనే రీతిగా మలుపు తిరిగింది.