ఉన్నట్లుండి.. ఉరుము లేని పిడుగులా అల్లు అరవింద్- బోయపాటి కాంబినేషన్ సినిమా అంటూ ఓ అనౌన్స్ మెంట్. నిజానికి ఇది కొత్త వార్త కాదు. చాలా అంటే చాలా కాలం కిందటే, అఖండ తరువాత బోయపాటి సినిమా మాదే అని అల్లు అరవింద్ బాహాటంగా ప్రకటించారు. కానీ అది అప్పటి నుంచి వార్తల్లోనే వుంది. స్కంధ ఫ్లాప్ తరువాత బోయపాటి గీతా కాంపౌండ్ లోనే తేలారు. అక్కడ బన్నీ కోసం కథ తయారు చేసే పనిలో బిజీ అయ్యారు. ఇది కూడా అందరికీ తెలిసిన వార్తే. కొత్తది కాదు.
మరి అలాంటపుడు హీరో ఎవరో చెప్పకుండా అల్లు అరవింద్.. బోయపాటి సినిమా అంటూ ప్రకటించడంతో అంతరార్ధమేమిటి? బన్నీతో త్రివిక్రమ్ సినిమా అని గతంలో ప్రకటించారు. అందులో గీతా భాగస్వామ్యం కూడా వుంది. కానీ బన్నీ వైపు నుంచి త్రివిక్రమ్ తో సినిమా వుంటుందా? వుండదా? అన్న క్లారిటీ కోసం జనాలు చూస్తున్నారు. గుంటూరుకారం సినిమా ఫలితం చూసే వరకు గీతా కాంపౌండ్ నుంచి ఏ సౌండ్ లేదు. గుంటూరుకారం పరాజయం తరువాత ఇప్పుడు వున్నట్లుండి బోయపాటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.
బోయపాటి ప్రాజెక్ట్ బన్నీతోనే అని సినిమా అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. గుంటూరుకారం సినిమా చూసిన తరువాత త్రివిక్రమ్ మీద ఓ క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు చేయలేరు. అప్ డేట్ కావడం లేదు. ఇంకా ఎక్కడో అమ్మ.. అత్త.. అల్లుడు సినిమాల దగ్గరే ఆగిపోయారు. కానీ ఇప్పటి తరం, ఇప్పటి జనం చూసే సినిమాలు వేరు. ఈ క్లారిటీ వచ్చిన తరువాత కూడా బన్నీ ఓ సినిమాను త్రివిక్రమ్ కు చేస్తారా? అలా చేయాలి అంటే త్రివిక్రమ్ అద్భుతమైన కథతో బన్నీ దగ్గరకు రావాల్సి వుంటుంది.
త్రివిక్రమ్ ను మెల్లగా తప్పించే క్రమంలో భాగంగానే బోయపాటి ప్రకటన వచ్చిందనుకోవాలి. ఒక్కసారిగా షాక్ ఇవ్వకుండా మెలమెల్లగా ఇవ్వడం అన్నది అరవింద్ ప్లానింగ్ లో భాగం అని కూడా అనుకోవాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మరింత క్లారిటీ అదే వస్తుంది.