జనసేనాని హస్తినకు వెళ్లారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉంటాయా? పుటుక్కుమంటాయా? అనే సందేహాలు రేగే స్థాయిలో చంద్రబాబునాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ ల ఏకపక్ష ధోరణుల మీద ధిక్కారస్వరం వినిపించి, తన పార్టీ తరఫున రెండు సీట్లను కూడా ప్రకటించేసి పవన్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరం.
అయితే తెలుగుదేశంతో కలిసిన పొత్తు బంధంలోకి కమలదళం కూడా వస్తుందా లేదా? చంద్రబాబు పల్లకీ మోయడానికి తనతోపాటుగా మోడీదళం కూడా సిద్ధమేనా కాదా? తేల్చుకోవడం కోసం మాత్రమే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
చంద్రబాబునాయుడు అరకు, మండపేట సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఉండవచ్చు. అందుకు అలిగి, పోటీగా, తన మీద ఒత్తిడి తెస్తున్న పార్టీ కార్యకర్తల సంతృప్తి కోసం, పార్టీ తరఫున రెండు సీట్లను పవన్ ప్రకటించి ఉండొచ్చు. కానీ వీటన్నింటి వెనుకాల అసలు కారణం మాత్రం ఒక్కటే.
ఇప్పటిదాకా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం తేలకపోవడం! ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనలైజ్ చేసేస్తూ దూసుకుపోతున్నారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు కూడా ఓపెన్ చేసి.. ప్రచారంలో ముందుకెళుతున్నారు. ఆ రకంగా అధికార పార్టీ సర్వసన్నద్ధం అవుతోంది.
ఇటువైపు ఒక జట్టులో రెండు పార్టీలు ఉంటే.. ఎవరు ఎక్కడ పోటీచేస్తారో కూడా తేల్చుకోలేని దీనస్థితిలో ఉన్నారు. వారు తేల్చుకోలేకపోవడానికి ప్రధాన కారణం.. బిజెపి నిర్ణయం బయటకు రాకపోవడం. బిజెపిని కూడా జట్టులో కలుపుకుని.. జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా పక్కకు మరలకుండా జాగ్రత్త తీసుకుని నెగ్గాలనేది పవన్ కోరిక. వారు తేల్చకపోవడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడుతోంది. ఈ రెండు పార్టీల మధ్య అసంతృప్తులు, అలకలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా.. ఏ సంగతి తేల్చుకోడానికే పవన్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.
బిజెపి కూటమిలోకి వస్తుందా రాదా.. ఈ టూర్లో తేలిపోతుంది. నిజానికి బిజెపి రాష్ట్ర నాయకులు కూడా.. తమ తమ అభిప్రాయాలను నివేదిక రూపంలో అధిష్ఠానానికి ఎన్నడో పంపారు. అయితే ఏపీ మీద పెద్దగా శ్రద్ధలేని అధిష్ఠానం అంత సీరియస్ గా పట్టించుకోవడం లేదు. అయితే.. వారి నిర్లిప్తత, జాప్యం తమను దెబ్బతీసే అవకాశం ఉంది గనుక.. తక్షణం నిర్ణయాలు తేల్చే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. మరి ఏం సాధించుకొస్తారో చూడాలి.