తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ నేత. తండ్రి నుంచి వారసత్వంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆరు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు నెగ్గారు. ఆ నాలుగు సార్లూ టీడీపీ జెండా మీదనే. ఆయనే విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. ఆయన తండ్రి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత.
గణబాబు 1999 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి గెలిచారు. ఆ మీదట జరిగిన 2004 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. 2019 నాటికి ప్రజారాజ్యం తరఫున విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి మళ్లీ ఓడారు. 2014లో తిరిగి టీడీపీ టికెట్ మీద నెగ్గారు. జగన్ వేవ్ లో సైతం 2019లో ఆయన అదే విజయాన్ని కంటిన్యూ చేశారు.
ఆయనకు 2024లో టికెట్ దాదాపుగా కన్ ఫర్మ్ అని చెప్పాలి. ఆయన మీద టీడీపీ హై కమాండ్ కి కూడా మంచి అభిప్రాయం ఉంది. అయితే టీడీపీలో మాత్రం ఒక వర్గం లొల్లి చేస్తోంది. ఆయనకే ఈసారి కూడా టికెట్ ఇస్తే మా సంగతేంటి అని కొందరు ఆశావహులు గోల పెడుతున్నారుట.
పైగా వారు కాస్ట్ ఈక్వేషన్స్ తెర మీదకు తెస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారని, ఈసారి వారికి టికెట్ ఇవ్వాలని కొత్త డిమాండ్ పెడుతున్నారు. ఈ విషయం మీద అధినాయకత్వంతో కూడా తేల్చుకోవాలని కొందరు నేతలు చూస్తున్నారుట.
విశాఖ పశ్చిమ నుంచి వరసగా మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన గణబాబు మీద ఎంతో కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది, దాన్ని సాకుగా చూపించి ఆయన సీటు కిందకు నీరు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అధినాయకత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరం.
ఇదే సీటు మీద జనసేన కూడా కన్నేసింది అని అంటున్నారు. పొత్తులలో భాగంగా కాపులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో సీట్లు చూసి మరీ అడుగుతున్నారుట. విశాఖ పశ్చిమ సీటు విషయంలో అధినాయకత్వం ఏమి చేస్తుందో చూడాలని అంటున్నారు.