సర్కారును దోచేసేందుకు ఆర్టీసీ పన్నాగం!

రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన తొలి నిర్ణయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించడం. ఒకటో సంతకం ఆ ఫైలు మీద చేసి, హామీలు అమలుచేస్తున్నాం అనే…

రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన తొలి నిర్ణయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించడం. ఒకటో సంతకం ఆ ఫైలు మీద చేసి, హామీలు అమలుచేస్తున్నాం అనే సంకేతాలు ఇచ్చారు రేవంత్. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పోటెత్తుతూ వచ్చారు. క్రమంగా ఈ రద్దీ నార్మల్ స్థాయికి చేరుకుంటూ వస్తోంది.

తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ సదుపాయం కావడంతో ఆధార్ కార్డు చూపించాలని అడుతున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ముసుగులో ప్రభుత్వ ఖజానాను దోచేసుకోవడానికి ఆర్టీసీ కంకణం కట్టుకున్నదా అనే అనుమానం.. పలు ఉదంతాలను గమనిస్తే అనిపిస్తోంది.

మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతి కల్పించినంత మాత్రాన.. అదేమీ ఆర్టీసీకి భారం అని, ఆ సంస్థ మునిగిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రయాణించే మహిళలకు ఆర్టీసీ జీరో టికెట్ కొడుతుంది.ఆ టికెట్లు అన్నింటికీ.. ప్రభుత్వం ఆర్టీసీకి బిల్లు చెల్లిస్తుంది. అంటే ప్రయాణించే ప్రతి మహిళ యొక్క టికెట్ ధరను రేవంత్ సర్కారు నిదానంగా సంస్థకు చెల్లిస్తుందన్నమాట. అంటే ఇక్కడ ప్రభుత్వానికి భారమే తప్ప.. సంస్థకు నష్టమేం లేదు.

కానీ ఈ ఏర్పాటును వాడుకుని.. ఆర్టీసీ కండక్టర్లు కొన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఒక మహిళ బస్సు ఎక్కి నల్గొండ వరకు టికెట్ కొట్టమని అడిగితే.. ఇద్దరు మహిళలు, ముగ్గురు మహిళలు ప్రయాణిస్తున్నట్టుగా… రెండు లేదా మూడు టికెట్లు కొట్టేసి కండక్టరు ఆ మహిళ చేతిలో పెడుతున్నాడు. టికెట్ మీద ఏం ఉందో సాధారణంగా ఎవ్వరూ గమనించరు. ధర చెల్లించేట్లయితే చూస్తారేమో గానీ.. ఉచితం గనుక టికెట్ మీద ఏం ప్రింట్ అయిందో చూడరు. మహిళలు దానిని పట్టించుకోవడం లేదు. అదే మాదిరిగా ఒక మహిళ హైదరాబాదులో బస్సు ఎక్కి సంగారెడ్డి వరకు టికెట్ అడిగితే, ఆ బస్సు వెళ్లే చివరి పాయింట్ వరకు అంటే ఉదాహరణకు జహీరాబాద్ వరకు టికెట్ కొట్టి చేతిలో పెట్టేస్తున్నాడు కండక్టరు.

ఇలాంటి పనుల వల్ల ఒక  మహిళ ప్రయాణిస్తే ముగ్గురు టికెట్ల సొమ్మును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుంది. 40 కిమీలు ప్రయాణించినా.. వంద కిమీల ధర ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. ఇలా బిజినెస్ ను పెంచి చూపించడం వల్ల కండక్టర్లకు ఇన్సెంటివ్ ఏమైనా ఉంటుందో లేదో తెలియదు గానీ.. ప్రయాణించే మహిళల సంఖ్య కంటె రెట్టింపుగా ప్రభుత్వానికి బిల్లు పడేలాగా ఆర్టీసీ వారు తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నారు.

తన పరిపాలనలో ఆర్టీసీలో అనేక సంస్కరణలకు కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టిన సజ్జనార్ కు అయినా ఈ తరహా దొంగచాటు దోపిడీ గురించి తెలుసో లేదో మరి.