దెబ్బ‌కు దెబ్బ కొట్టామంటున్న నాగ‌బాబు!

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు భ‌లే చిత్ర‌మైన మ‌నిషి. మ‌నసులో ఏదో దాచుకోలేరాయ‌న‌. మ‌న‌సులోని ప్ర‌తి భావ‌న‌ను బ‌య‌ట పెట్టుకోవ‌డం అన్ని స‌మ‌యాల్లో మంచిది కాదు. ముఖ్యంగా రాజ‌కీయాల్లో చాలా సంయ‌మ‌నం అవ‌స‌రం. మ‌న‌సులోని…

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు భ‌లే చిత్ర‌మైన మ‌నిషి. మ‌నసులో ఏదో దాచుకోలేరాయ‌న‌. మ‌న‌సులోని ప్ర‌తి భావ‌న‌ను బ‌య‌ట పెట్టుకోవ‌డం అన్ని స‌మ‌యాల్లో మంచిది కాదు. ముఖ్యంగా రాజ‌కీయాల్లో చాలా సంయ‌మ‌నం అవ‌స‌రం. మ‌న‌సులోని ప్ర‌తి విష‌యాన్ని బ‌య‌టికి వెల్ల‌డిస్తే, రాజ‌కీయాల్లో న‌ష్ట‌పోవ‌డం త‌ప్ప ఒరిగేదేమీ వుండ‌దు.

మెగా బ్ర‌ద‌ర్స్ దారి త‌ప్పి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. స్థిర‌మైన అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు ఉండ‌క‌పోవ‌డం వారి విధానం. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే క్ర‌మంలో టీడీపీతో జ‌న‌సేనాని ప‌వ‌న్ పొత్తు పెట్టుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఇంత వ‌ర‌కూ సీట్లు, నియోజ‌క వ‌ర్గాల లెక్క తేల‌లేదు. చంద్ర‌బాబు రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ప‌వ‌న్ హ‌ర్ట్ అయ్యారు.

దీంతో త‌గ్గేదే లే అనే రేంజ్‌లో ప‌వ‌న్ కూడా రెండు నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించి ఏపీ రాజ‌కీయాల్లో దుమారం రేపారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు, ప‌వ‌న్ అన్న నాగ‌బాబు వ‌రుస ట్వీట్లు చ‌ర్చ‌కు తెర‌లేపాయి. న్యూట‌న్ మూడు సిద్ధాంతాల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

వీటిలో ప్ర‌ధానంగా న్యూట‌న్ మూడో సిద్ధాంతం టీడీపీని హెచ్చ‌రించ‌డానికే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. చర్య‌కు ప్ర‌తి చ‌ర్య‌కు వుంటుంద‌నే న్యూట‌న్ మూడో సిద్ధాంతాన్ని నాగ‌బాబు ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ, దాన్ని ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అన్వ‌యిస్తూ మాట్లాడుకోవ‌డం విశేషం. నాగ‌బాబు దృష్టిలో టీడీపీని దెబ్బ‌కు దెబ్బ తీశామ‌నే ఆనందం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు రెండు నియోజ‌క వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తే, త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అంతే సంఖ్య‌లో ప్ర‌క‌టించి… టీడీపీని దెబ్బ తీశార‌ని చెప్ప‌డం ద్వారా జ‌న‌సేన శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేశారు.