ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్ని చేర్చుకుంటే రాజకీయంగా ప్రయోజనం వుంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. అదేంటో గానీ, చంద్రబాబునాయుడికి ఆ స్పృహ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన వాళ్లకే పచ్చ కండువా కప్పి, టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయనే సీన్ క్రియేట్ చేయడానికి తహతహలాడటం విమర్శలకు దారి తీసింది.
కొలికపూడి అని ఒకాయన హైదరాబాద్‌లో వుంటారు. జనంతో సంబంధం లేని వ్యక్తిగా ఆయనంటే గిట్టని వాళ్లు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన నిత్యం ఎల్లో చానళ్లలో తప్ప, మరెక్కడా కనిపించరు. వివాదాస్పద కామెంట్స్‌తో రాజకీయ పార్టీల అగ్రనేతల దృష్టిలో పడేందుకు ఈయనగారు పరితపిస్తున్నారు. నెల రోజుల్లో ఇంగ్లీష్, హిందీ, తమిళం తదితర భాషలను నేర్చుకోవడం ఎలా? అని తెలుగులో పుస్తకాలు చూశాం.
ఆ లెక్కన ఒకట్రెండు రోజుల్లో సులువుగా నాయకులు కావడం ఎలా? పాపులారిటీ సంపాదించడం ఎలా? అనే విద్యలో సదరు నాయకుడు ఆరితేరాడని చెబుతుంటారు. ఎల్లో చానళ్లలో 24 గంటలూ కూచుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిడుతుంటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే దిక్కు అని పసుపు కండువా వేసుకోకుండానే తెగ పొగుడేస్తుంటారాయన. ఇలాంటి ఆయన ఒక శుభ ముహూర్తం చేసుకుని చంద్రబాబు చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకున్నారు. ఈయన గారి చేరికతో టీడీపీకి ఒరిగిందేంటో కనీసం, ఆయనకు కండువా వేయించిన వారికైనా తెలిసి వుంటే మంచిది.
టీడీపీ వాలకం, అలాగే ఆయన గారి చేరిక వార్తల్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊదరగొట్టడం చూసి జనం నవ్వుకుంటున్నారు. వీరిని చూస్తే… చంద్రబాబు పరమ భక్తులైన మరో ఐదారుగురు ఎల్లో జర్నలిస్టులు కూడా టీడీపీలో చేరిపోతారంటూ పేర్లతో సహా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ఒక మహా లక్ష్మి కూడా ఉందండోయ్. చంద్రబాబు అరెస్ట్, విడుదలకు సంబంధించిన చర్చలో ఒక సస్పెండ్ జడ్జి అభిప్రాయాన్ని తీసుకుంటూ సదరు మహిళా జర్నలిస్టు కరుణ రసాన్ని పొంగి పొర్లించడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో సెటైర్లు పేలాయి.
ఎన్నికల నాటికి, చివరిగా ఆ ఇద్దరు, ముగ్గురు ఎల్లో మీడియాధిపతుల్ని కూడా టీడీపీలో చేర్చుకుని వలసలు వెల్లువెత్తుతున్నాయంటూ బ్రేకింగ్ న్యూస్‌గా ప్రసారం చేసుకుంటారేమో అని నెటిజన్లు వెటకరిస్తున్నారు. ఆ మీడియాధిపతులెవరో ఒక్క సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పే దుష్టచతుష్టయం గురించి తెలుసుకుంటే సరి.
టీడీపీ పల్లకీ మోసే వాళ్లకే కండువాలు కప్పుకుంటూ సంబరపడుతున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయననకు జాకీలు వేసి లేనిది ఉన్నట్టు కనికట్టు చేసేందుకు యత్నిస్తున్న ఎల్లో మీడియాని చూస్తుంటే జనానికి ఇంతకంటే వినోదం ఏం కావాలని నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.