అరవింద్..సురేష్ బాబు ఎందుకు దూరం?

టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్… సినిమా నిర్మాణాల బంద్..ఇలాంటివి వ్యవహారాల్లో కీలకమైన రెండు పేర్లు మిస్ అవుతున్నాయి. వినిపించడం లేదు. అల్లు అరవింద్..దగ్గుబాటి సురేష్ బాబుల పేర్లు కనిపించడం లేదు. కారణం ఏమిటి? వీరు…

టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్… సినిమా నిర్మాణాల బంద్..ఇలాంటివి వ్యవహారాల్లో కీలకమైన రెండు పేర్లు మిస్ అవుతున్నాయి. వినిపించడం లేదు. అల్లు అరవింద్..దగ్గుబాటి సురేష్ బాబుల పేర్లు కనిపించడం లేదు. కారణం ఏమిటి? వీరు తెర వెనుక వుండి వుండొచ్చు. లేకపోవచ్చు. కానీ ఎందుకు కనిపించడం లేదు. అంటే ఆసక్తి కరమైన విషయాలు వినిపిస్తున్నాయి.

సినిమా నిర్మాణాల బంద్ వెనుక ఐడెంటిఫై చేసిన సమస్యల్లో థియేటర్ల విపిఎఫ్ చార్జీలు ఒకటి. ఈ చార్జీలు తగ్గాలన్నది ఒకటి. వీటిని థియేటర్ల యజమానులే భరించాలి అన్నది మరొకటి.

ఇది అంత సులువుగా తేలే సమస్య కాదు. విపిఎఫ్ చార్జీలు భరించడానికి థియేటర్ల యజమానులు రెడీగా లేరు. అవసరం అయితే థియేటర్లు మూసుకుంటాం కానీ వాటిని భరించేది లేదు అంటున్నారట. ముఖ్యంగా నగరాల్లో సెంటర్లలో వున్న థియేటర్ల రియల్ ఎస్టేట్ వాల్యూ బాగా పెరిగింది. అందువల్ల మరో విధంగా వాడుకుంటాం కానీ ఇలాంటి వాటికి ఒప్పుకోం అంటున్నారట.

థియేటర్లు కాపాడండి అన్నారు. అందుకే రేట్లు తగ్గించుకుంటున్నాం. ఓటిటికి 8 వారాలకు కానీ ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నాం. దాని వల్ల కొంత నష్టపోతున్నాం. అందువల్ల మీరూ కొంత భరించండి అన్నది నిర్మాతల వాదన. పైగా టికెట్ రేట్లు తగ్గిస్తున్నారు తప్ప తినుబండారాలు, పార్కింగ్ చార్జీలు తగ్గించడం లేదు కదా అని అంటున్నారు. ఈ పీట ముడి అలా వుంది.

ఇక్కడ అల్లు అరవింద్ కీలకమైన ‘క్యూబ్’ సర్వీస్ ప్రొవైడర్ వెనుక వున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు ‘యుఎఫ్ఓ’ వెనుక వున్నారు. అందువల్ల ఈ వివాదంలో తలదూర్చడం ఇష్టం లేక ఆ ఇద్దరూ సైలంట్ అయిపోయారని తెలుస్తోంది. 

ఎలాగూ బంద్ లోకి దిగాం కనుక విపిఎఫ్ సంగతి తేలిస్తే తప్ప ఊరుకోమని గిల్డ్ సభ్యులు అంటున్నారు. విపిఎఫ్ తమ మీద పడేస్తే థియేటర్లు మూసి పడేస్తాం అని తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా మూకుమ్మడిగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.