రాజకీయ నాయకుల మధ్య రాజకీయాల పరంగా, సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా విభేదాలు ఉండొచ్చు. తప్పులేదు. కానీ వ్యక్తిగత వైరాలు ఉండకూడదు. కానీ తెలంగాణా సీఎం కేసీఆర్ – ప్రధాని మోడీ మధ్య రాజకీయ విభేదాలు వ్యక్తిగత వైరం వరకు వెళ్లాయి. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అని ప్రశ్నించుకుంటే ఏమీ లేదనే చెప్పాలి.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో హీరో కావాలనుకుంటున్నారు. అలా హీరో కావాలంటే ఒక్కటే మార్గం మోడీని ద్వేషించడం. అది కూడా గుడ్డిగా వ్యతిరేకించడం.
రాజకీయ నాయకుడికి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలియాలి. వాస్తవానికి ఈ విషయంలో కేసీఆర్ మాస్టర్స్ చేశారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన చాలామంది నాయకులను తన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అక్కున చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. వేరే పదవులు కట్టబెట్టారు. ఫిరాయింపులతో టీడీపీని ఉనికిలో లేకుండా చేశారు. కాంగ్రెస్ ను బలహీనం చేశారు.
ఉద్యమంలో హోరాహోరీ పోరాడిన వారిని దూరం పెట్టారు. ప్రజల్లో వారి ఉనికి లేకుండా చేశారు. ఇన్ని మార్గాలు అనుసరించి పార్టీ బలం పెంచుకున్నారు. చంద్రబాబుది చాలామంది యూజ్ అండ్ త్రో పాలసీ అంటారు. కానీ కేసీఆర్ కూడా ఆ టైపే. తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేవారిని దగ్గరకు తీస్తారు. లేదనుకుంటే దూరం పెడతారు.
ప్రతీ రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ ఆధినేతా చేసే పని ఇదే. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ఒకేసారి అధికారంలోకి వచ్చారు. అప్పట్లో చాలా విషయాల్లో కేసీఆర్ మోడీకి మద్దతు ఇచ్చారు. మోడీ కూడా కేసీఆర్ ను చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు.
కానీ కేసీఆర్ కు ఎప్పుడైతే జాతీయ రాజకీయాల పిచ్చి పెట్టుకుందో అప్పటి నుంచి మోడీతో అగాధం సృష్టించుకున్నారు. కాలక్రమంలో దాన్ని పెంచుకున్నారు. ఆ తరువాత వ్యక్తిగత వైరంగా మార్చుకున్నారు. దీంతో కేంద్రం కూడా కొన్ని విషయాల్లో రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేయడం మొదలుపెట్టింది.
ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రంగా సాగుతున్నాయి. కేసీఆర్ చేతిలో మీడియా ఉంది కాబట్టి కేంద్రంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీని కేసీఆర్ వ్యక్తిగతంగా కలిసి దాదాపు ఏడాది అయింది. వీరిద్దరూ చివరిసారి కలుకుసుకున్నది గత ఏడాది సెప్టెంబర్ మూడో తేదీన. అంటే వచ్చే మూడో తేదీకి ఏడాది పూర్తి అవుతుంది.
గత ఏడాది సెప్టెంబర్ 3 న కేసీఆర్ ఢిల్లీలో మోడీని కలిసి రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అంతే…. తరువాత కలుసుకోలేదు. గత ఏడాది నవంబరులో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఇద్దరి మధ్య సంబంధాలు పునరుద్ధరించలేనంతగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం కేసీఆర్- గవర్నర్ తమిళిసై సంబంధాల మీద కూడా పడింది.
చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా మూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోడీ వచ్చినప్పుడు అనారోగ్య కారణం చెప్పి కేసీఆర్ వెళ్ళలేదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవాలకు మోడీ వచ్చినప్పుడు వెళ్ళలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోడీ వచ్చినప్పుడు కలుసుకోలేదు.
తాజాగా మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీని కోసం కేసీఆర్ కు ఆహ్వానం కూడా అందింది. ఈ కమిటీలో లోక్ సభ స్పీకర్ తోపాటు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మీడియా, ఆధ్యాత్మిక, సినిమా ప్రముఖులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు ఉన్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
ఆజాదీ కా అమృత మహోత్సవాలకు పోటీగా కేసీఆర్ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో మోడీని ఢీకొనడానికి జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ పెట్టాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట.