కళ్ళు ఎపుడూ ఎదురు వైపే చూస్తాయి. వేళ్ళు ఎపుడూ ఎదుటి వారి మీదనే చూపిస్తాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఎదుటి పార్టీ వారి సంగతి మీద చాలా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది పరుగుపందెం. ఎంతసేపూ ఆ వైపు చూస్తే మన వైపు ఏమవుతుందో తెలియదు, తెలిసేసరికి సీన్ ఏమవుతుందో అసలు తెలియదు.
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు చూడబోతే వైసీపీలో సంగతులు బాగా తెలిసిపోతున్నాయి. అలాగే వైసీపీలో క్యాడర్ ఏమనుకుంటోందో కూడా ఆయనకు బాగా తెలిసిపోతోంది. వైసీపీ ఇక గెలవదు అని వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారని అచ్చెన్నాయుడు కొత్త మాట చెబుతున్నారు.
ఈసారి వైసీపీ గెలవడం కష్టమని ఆ పార్టీ వారే అనుకుంటే అచ్చెన్న చెవిన పడిందట. దాంతో ఆయన ఇది చాలా గొప్పగా ఉందని ట్వీట్ చేశారు. సరే వైసీపీలో ఏ కార్యకర్త అలా అన్నారో ఎవరు ఏమంటున్నారో ఆ సంగతి ఆ పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది. మరి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు సొంత పార్టీలో క్యాడర్ ఏమనుకుంటుందో చూస్తే బాగుంటుందని వైసీపీ నేతలు సలహా ఇస్తున్నారు.
చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్నాయుడు అంటున్నారని, ఏనాడో దాన్ని జనాలు డిసైడ్ చేశారని చెబుతున్నారని అది టీడీపీ అతి ధీమా అని ఈ మధ్య దాకా జరిగిన అన్ని ఎన్నికలు నిరూపించాయి కదా అని వైసీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు.
మొత్తానికి అంతటి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఇపుడు వైసీపీ లోపల వ్యవహారాల మీద దృష్టి పెట్టడం అంటే వింతే మరి అంటున్నారు.