తెలంగాణలో క్రితం సారి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి.. కాంగ్రెస్ లో అసంతృప్తవాదిగా తయారయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానంపై బోలెడన్ని సార్లు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ లీడర్ల మీద దుమ్మెత్తి పోశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా.. రాజగోపాల్ రెడ్డి సణుగుడు మరింత పెరిగింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీద తో సహా అనేక మందిపై ఆయన విరుచుకుపడ్డారు.
ఇదంతా కాంగ్రెస్ లో మామూలే అనుకుంటే, ఇంతలో బీజేపీని ప్రశంసించడం మొదలుపెట్టారు. బీజేపీ తెలంగాణలో గెలుస్తుందంటూ వస్తున్నారు. మోడీ, షా లను విపరీతంగా ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరడం ఖాయమే అని సహజంగానే అనుకుంటున్నారంతా.
ఈ మేరకు ఆయన కాంగ్రెస్ కు రాజీనామా ను ప్రకటించారు. మరి బీజేపీలోకి చేరడం విషయంలో మాత్రం ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నారట! త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారట! స్పీకర్ ను కలిసి రాజీనామాను అందిస్తారట. మరి ఆ రాజీనామా ఆమోదం పొందితే.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, అందులో గెలవడానికి టీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తుందని, నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరుగుతుందంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
కాంగ్రెస్ కు రాజీనామా అట, సోనియా- రాహుల్ ను విమర్శించరట, బీజేపీ పద్ధతి బాగుందట, బీజేపీ గెలుస్తుందట, టీఆర్ఎస్ పై పోరాటానికి కాంగ్రెస్ కు రాజీనామా అట, ఉప ఎన్నికలతో తన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందట! చాన్నాళ్లుగా రాజకీయ పయనంపై గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న రాజగోపాల్ రెడ్డి అదే కన్ఫ్యూజన్ లో కొనసాగుతున్నట్టుగా ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి పయనం బీజేపీ వైపే అని స్పష్టం అవుతోంది. అయితే నిజంగానే ఆయన నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే.. అక్కడ కాంగ్రెస్ ఏమీ జీరో అయిపోదు! కాంగ్రెస్ పోటీలో నిలిస్తే.. బీజేపీ తరఫున ఆయన నిలిస్తే.. అప్పుడు టీఆర్ఎస్ పని మరింత సులువు కావొచ్చు! ఇలా చూస్తే.. కోమటి రెడ్డి ఉప ఎన్నికల వరకూ వెళితే ఆయన ఇమేజే డ్యామేజ్ అయిపోతుందని స్పష్టం అవుతోంది.
అయితే బీజేపీ కూడా కోమటిరెడ్డి చేరికతో ఉప ఎన్నికను కోరుకుంటుందా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయమే ఉంది. ఇలాంటి తరుణంలో రిస్కీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని నమ్ముకుని ఉప ఎన్నికలకు బీజేపీ కూడా ఏ మేరకు రెడీ అంటుందనేదీ సందేహమే.
మోడీ, షా లను కోమటిరెడ్డి ప్రశంసిస్తున్నారు కానీ, తెలంగాణ బీజేపీ నేతలతో ఏ మేరకు సర్దుకుపోగలరనేదీ సందేహమే. స్థూలంగా ఆయన రాజకీయం క్రాస్ రోడ్స్ కు చేరుతున్నట్టుగా ఉంది.