ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిగా పెట్టారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన సర్వేలు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా ఓ సర్వే నివేదిక ఆయనకు చేరింది. ఓ 20 మంది ఎమ్మెల్యేలు తప్పక ఓడిపోతారనే నివేదిక ఆయనకు అందినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విషయమై సంబంధిత ఎమ్మెల్యేలను పిలిపించి స్వయంగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. సదరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలేంటో వివరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలని, లేదంటే టికెట్ ఇచ్చే ప్రసక్తే వుండదని స్పష్టం చేస్తున్నారని సమాచారం. వైసీపీ అధిష్టానం పెద్దలు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది.
గడపగడపకూ ప్రజాప్రతినిధులను పంపుతూ, మరోవైపు వారిపై సర్వే చేయిస్తుండడం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది. కొందరు ఎమ్మెల్యేలు తమపై సర్వే నివేదిక వివరాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు.
ఇలా ఒకరికొకరు మీపై ఏదైనా నివేదిక వచ్చిందా అంటూ ఆరా తీస్తున్నారని తెలిసింది. క్షేత్రస్థాయిలో అంతా బాగుందున్నట్టు సర్వేలో తేలిన వాళ్లు మాత్రం హ్యాపీగా ఉన్నారు. లేని వాళ్లు మాత్రం ఆవేదనతో ఉన్నారు.
అసలే జగన్ గెలుపు ప్రాతిపదికన కఠిన నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో మరో రెండేళ్లలో లోపాలను సరిదిద్దుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.