Advertisement

Advertisement


Home > Movies - Movie News

గేదెలు పాలు ఇస్తాయ‌ని తెలియ‌ని అరియానా

గేదెలు పాలు ఇస్తాయ‌ని తెలియ‌ని అరియానా

కొత్త జ‌న‌రేష‌న్ మీద ఒక జోక్ వుంది. బియ్యం సూప‌ర్ మార్కెట్‌లో దొరుకుతాయ‌ని, పాలు ప్యాకెట్ల‌లో త‌యారు చేస్తార‌ని వాళ్లు అనుకుంటార‌ట‌! ఇది జోక్ కాదు, నిజ‌మే. వాళ్లు ఇంత‌కు మించి అజ్ఞానంలో వున్నారు.

బిగ్‌బాస్‌లో శ‌నివారం ఒక టాస్క్ ఇచ్చారు. ఒక ఆవు బొమ్మ నుంచి పాలు తీసుకుని బాటిళ్ల‌లో నింపాలి. దీనికి సంచాల‌కులుగా వున్న అరియానాకి ఒక అనుమానం వ‌చ్చింది. గేదెలు పాలు ఇస్తాయా అని? ఆవులు మాత్ర‌మే పాలు ఇస్తాయ‌ని తెలుస‌ట‌. గేదెలు కూడా ఇస్తాయా అని శివ‌ని అడిగింది.

అరియానా మామూలు మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి. చిన్న‌ప్ప‌టి నుంచి పాలు తాగే పెరిగి వుంటుంది. గేదెల్ని చూడ‌కుండా ఏమీ వుండ‌దు. అవి పాలు ఇస్తాయ‌ని, మ‌నం తెల్లారి తాగేది ఆ పాలేన‌ని ఆమెకి తెలియ‌దు.

పిల్ల‌లు చాలా మంది ప‌రిస్థితి ఇదే. వాళ్ల‌ని టూర్ తీసుకెళ్లాల్సింది వూటీ, కొడైకెనాల్‌కి కాదు. నెల‌కోసారి ప‌ల్లెల‌కి తీసుకెళ్లి ప్ర‌కృతిని, వ్య‌వ‌సాయాన్ని ప‌రిచ‌యం చేయాలి. లేదంటే వాళ్లు తినే ఐస్‌క్రీం, యాప్‌లో బుక్ చేసుకుంటే వ‌స్తుంద‌నుకుంటారు.

ఐస్‌క్రీం త‌యారీకి పాలు కావాల‌ని, అవి కావాలంటే గేదెల్ని మేపి, వాటిని ఆరోగ్యంగా చూసుకుని, తెల్లారి లేచి పాలు పిత‌కాలి. చ‌క్కెర కావాలంటే చెరుకు నాటి, నీళ్లు క‌ట్టి, కోత కోసి, చ‌క్కెర మిల్లుకి త‌ర‌లిస్తే అక్క‌డ వేలాది మంది కార్మికులు ప‌ని చేయాలి. ఇది గాకుండా ఐస్‌క్రీం ఫ్యాక్ట‌రీలో ఎంతో మంది కార్మికులు ప‌ని చేయాలి. త‌రువాత మాసిపోయిన బ‌ట్ట‌ల‌తో వున్న ఒక వ్యాన్ డ్ర‌యివ‌ర్ ఐస్‌క్రీంని పార్ల‌ర్‌ల‌కి త‌ర‌లిస్తే పిల్ల‌లు ఎంజాయ్ చేస్తారు.

ఏమీ తెలియ‌కుండా, తెలుసుకోకుండా, యూట్యూబ్‌, వాట్స‌ప్‌లే ప్ర‌పంచ‌మ‌నుకుంటే, అది ఏదో ఒక రోజు త‌ల‌కిందుల‌వుతుంది.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?