సినిమా టికెట్ రేట్లు సినిమా భవిష్యత్ ని, రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్నాయనే మాట ఇటీవల బలంగా వినిపిస్తోంది. కేవలం టికెట్ రేట్లు భారీగా ఉన్నాయనే కారణంతోనే ఓ వర్గం థియేటర్లకు దూరమైందని.. ఆర్ఆర్ఆర్ అందుకు మినహాయింపని, కేజీఎఫ్-2 రేట్లు అందుబాటులో ఉండటం వల్లే జనాలను రప్పించగలిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ చర్చపై ఓ స్పష్టత తీసుకురాబోయే సినిమా ఎఫ్-3.
వెంకటేష్, వరుణ్ తేజ్ క్రేజ్ కంటే.. ఎఫ్-2 కి వచ్చిన క్రేజ్, ఎఫ్3కి పెద్ద క్రౌడ్ పుల్లర్. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని టికెట్ రేట్ల పెంచడం లేదని నిర్మాత దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు. సో.. ప్రభుత్వాన్ని కోరడం, ప్రత్యేక జీవోల లాంటి గొడవల్లేవు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సాధారణ టికెట్ రేట్లకే ఎఫ్3ని ప్రదర్శించబోతున్నారు. అంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు టికెట్ రేట్ అందుబాటులో ఉన్నట్టే.
సో.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్ లు జరిగి, థియేటర్లు ఫుల్ అయితే మాత్రం కచ్చితంగా మిగతా నిర్మాతలు, పెద్ద హీరోలు కూడా టికెట్ రేట్ల పెంపుపై ఆలోచించాల్సిన సమయం వచ్చినట్టే.
ఇటీవల ప్రతి పెద్ద సినిమాకి బడ్జెట్ ని చూపించి తొలి వారం టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం వద్ద అనుమతులు తీసుకుంటోంది చిత్ర యూనిట్. దీనివల్ల అదనపు ఆదాయం సమకూరుతుందనేది ఇండస్ట్రీ ఆలోచన. మొదటి వారాంతానికే 60శాతం బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చనేది వాళ్ల ప్లాన్. కానీ జనాలు థియేటర్ల వైపు చూడకపోతే అసలుకే మోసం వస్తుంది. ఈ విషయం ఇప్పుడిప్పుడే సినీ జనాలకు అర్థమవుతోంది.
ఇటీవల ఆచార్య సినిమాకు ఇలాగే టికెట్ రేట్లు ప్రతిబంధకంగా మారాయి. సూపర్ హిట్ టాక్ ఉంటేనే జనాలు థియేటర్లకు రావాలనుకుంటున్నారు. ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా వేచి చూసే ధోరణిలో ఉంటున్నారు. ఎలాగూ ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే అభిప్రాయం వారిలో ఏర్పడిపోయింది.
రిపీటెడ్ ఆడియన్స్ సంగతి దేవుడెరుగు.. అసలు ఫస్ట్ టైమ్ ఆడియన్ కూడా సినిమా హాల్ వైపు చూడటం లేదంటే తప్పు ఎవరిది. సినిమా పర్లేదు అనుకున్నా కూడా జనాలు టికెట్ రేట్లు చూసి బెంబేలెత్తుతున్నారు. సింగిల్ కింగ్ లకు పర్లేదు కానీ, ఫ్యామిలీతో సినిమాలకొచ్చేవారికి మాత్రం జేబు గుల్ల అవుతుంది. అందుకే కుటుంబ ప్రేక్షకులు తొలివారం సినిమా హాళ్లకు దూరంగా ఉంటున్నారు. రెండోవారానికి ప్రయారిటీలు మారిపోతున్నాయి.
ఇలాంటి విశ్లేషణలు, అనుమానాల మధ్య ఎఫ్3 సినిమా వస్తోంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ. పైగా సాధారణ రేట్లతో వస్తున్న సినిమా. కాబట్టి ఈ సినిమాకు మొదటి రోజు నుంచే కుటుంబ ప్రేక్షకులు పోటెత్తితే, అప్పుడిక టాలీవుడ్ పునరాలోచించుకోవడం బెటర్. తమ సినిమాల్ని కూడా సాధారణ రేట్లకే రిలీజ్ చేయడం ఉత్తమం. ఏ విషయం ఎఫ్-3 సినిమాతో తేలిపోతుంది.