సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు ఉంచామని ఏపీ ప్రభుత్వం సంబరపడింది. ఆ తర్వాత సినిమా వాళ్ల అభ్యర్థన మేరకు ఆ రేట్లను కాస్త సవరించింది. ఇక టాలీవుడ్ అభ్యున్నతి కోసం అన్నట్టుగా తెలంగాణలో టికెట్ రేట్లను ఇష్టమొచ్చినట్టు పెంచుకుంటూ పోయారు. ఇలా అధికారికంగా పెంచిన రేట్లు కాకుండా.. ఆమధ్య ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, సర్కారువారి పాట లాంటి సినిమాలు రిలీజైనప్పుడు పెంచిన రేట్లు వీటికి అదనం.
ఇలా ఈమధ్య కాలంలో టికెట్ రేట్లపై తెలుగు రాష్ట్రాల్లో చాలా గందరగోళం నెలకొంది. ఏ సినిమాకు, ఏ రాష్ట్రంలో ఎంత టికెట్ రేటు పెట్టారో తెలియని అయోమయ పరిస్థితి కూడా ఏర్పడింది. ఏ సినిమాకు, ఏ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఈ అవ్యవస్థను ఎవరు గాడిలో పెడతారు?
మొన్నటివరకు జరిగిన ఈ చర్చకు సమాధానం దొరికేసింది. టికెట్ రేట్ల విషయంలో ఉన్న అవ్యవస్థను ప్రేక్షకుడే గాడిలో పెట్టాడు. ఏ సినిమాకు ఎంత రేటు పెడితే థియేటర్ కు వచ్చి చూడాలో ప్రేక్షకుడే పరోక్షంగా నిర్ణయించాడు. అవును.. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సినిమాలకు విధించిన టికెట్ రేట్లు ప్రేక్షకుడు ఫిక్స్ చేసినవే.
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచేశారు. చివరికి శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ లాంటి చిన్న సినిమాకు కూడా మల్టీప్లెక్సుల్లో భారీ రేట్లు పెట్టారు. దీంతో ప్రేక్షకుడు థియేటర్ మొహం చూడడం మానేశాడు. ఆచార్య నుంచి ఈ డౌన్ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో నిర్మాతలు దిగొచ్చారు.
ప్రభుత్వం విధించిన శ్లాబులతో సంబంధం లేకుండా తమ సినిమాకు ఏ రేటు పెడితే ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడో ఆలోచించి మరీ టికెట్ రేట్లు తగ్గించారు.
ఇది మాత్రమే చాలదంటున్న ప్రేక్షకుడు..
మేజర్, విరాటపర్వం లాంటి సినిమాతో పాటు ఈమధ్య వచ్చిన చాలా సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించారు. ఇక ఈ శుక్రవారం రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమాకు మరింతగా టికెట్ రేట్లు తగ్గించారు. ప్రస్తుతం థియేటర్లలో యావరేజ్ గా చూసుకుంటే.. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 200 నుంచి 250 రూపాయల మధ్య టికెట్ రేట్లు లాక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ లో 150 నుంచి 175 మధ్య టికెట్ రేట్లు ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకంటే ఇంకాస్త తక్కువగా రేట్లు అమల్లో ఉన్నాయి. మల్టీప్లెక్సుల్లో 250 రేటు కూడా కరెక్ట్ కాదనే వాళ్లున్నారు.
అయితే ఇవి మాత్రమే చాలవంటున్నాడు ప్రేక్షకుడు. ఇంటర్వెల్ లో తాము తినే స్నాక్స్, తాగే కూల్ డ్రింక్ రేట్లు కూడా తగ్గాలని పరోక్షంగా డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం థియేటర్ల ఆక్యుపెన్సీ క్యాంటీన్ రేట్లపై కూడా ఆధారపడింది. హైదరాబాద్ లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కు వెళ్తే స్నాక్స్ కు ఎంత ఖర్చవుతుందో, ఏఎంబీ మాల్ లో సినిమాకు వెళ్తే అంతకు మూడింతలు స్నాక్స్ ఖర్చు అవుతుంది.
సో.. ఆక్యుపెన్సీ కూడా దీనికి తగ్గట్టుగానే ఉంటోంది. స్నాక్స్ రేట్లు తక్కువగా ఉన్న మల్టీప్లెక్సులకు వెళ్లేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏఎంబీ, ఐనాక్స్, పీవీఆర్ కంటే ఏషియన్ గ్రూప్ కు చెందిన మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ కాస్త ఎక్కువగా కనిపించడానికి ఇది కూడా ఓ కారణం.
నిర్మాతలు ఇప్పటికే రేట్లు తగ్గించారు. ఇక థియేటర్ యాజమాన్యాలు కూడా ఓ అడుగు ముందుకేసి స్నాక్స్ రేట్లు తగ్గిస్తే వాళ్లకే మంచిది. లేదంటే, పరోక్షంగా ఓటీటీకి ఊతమిచ్చినట్టవుతుంది. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టవుతుంది.