ఓ వ్యక్తి సినిమా తీస్తాడు, నిర్మాతగా అతడే కనిపిస్తాడు. కానీ లాభాలు మాత్రం అతడు మాత్రమే అందుకోడు. అతడితో పాటు చాలామంది తెరవెనక నిర్మాతలుగా పనిచేస్తారు. సినిమాతో సంబంధం లేకపోయినా భారీగా లాభాలు అందుకుంటారు. ఇప్పుడీ థర్డ్ పార్టీ వ్యవహారాలు పరిశ్రమలో ఎక్కువైపోయాడు. ఈ దిశగా టాలీవుడ్ పై చాలామంది కన్ను పడింది.
మొన్నటికిమొన్న ఓ సినిమా సెట్స్ పైకి రాగానే ఆ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నింటినీ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. నాన్-థియేట్రికల్ కు ఆదిత్యకు ఏంటి సంబంధం అని అడగొద్దు. వాళ్ల దగ్గర డబ్బులున్నాయి, కొనుక్కున్నారంతే. తర్వాత నిదానంగా ఇతర ఛానెళ్లు, ఓటీటీలకు లాభానికి అమ్ముకుంటారు. నిజానికి ఈ సంస్థ నేరుగా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాలని భావించింది. ఆ దిశగా ప్రయత్నం కూడా చేసింది. కానీ చేతులు కాలడంతో ఇలా మధ్యేమార్గంగా పెట్టుబడి విధానాన్ని అనుసరించింది.
రీసెంట్ గా ఓ సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. టాలీవుడ్ తో సంబంధం లేని బీ4యు అనే సంస్థ, తెలుగులో ఓ పెద్ద సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. అది కూడా చాలా భారీ మొత్తానికి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల నిర్మాతలే ఆ సంస్థ నుంచి తిరిగి రైట్స్ ను వెనక్కి తీసుకున్నారు. ఇలా చేయడం కోసం అదనంగా 15 శాతం చెల్లించాల్సి వచ్చింది. అట్నుంచి అటు ఆ భారీ మూవీ స్టార్ మా ఛానెల్ కు వెళ్లింది.
ఆదిత్య మ్యూజిక్, బీ4యూ, టీ-సిరీస్, జీ స్టుడియోస్ లాంటి సంస్థలన్నీ ఇప్పుడు టాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టాడు. నేరుగా నిర్మాణ రంగంలోకి దిగకుండా, తమ డబ్బుతో ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో బిజినెస్ ప్లాన్. ఈ సంస్థలతో పాటు నేరుగా కొంతమంది బడా బాబులు కూడా ఇలాంటి వ్యాపారం షురూ చేశారు. వీళ్లలో ఒకరు నిర్మాత శరత్ మరార్. పలు నిర్మాణ సంస్థలతో కలిసి ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. కొన్నిసార్లు పెట్టుబడితో సంబంధం లేకుండా స్లీపింగ్ పార్టనర్ గా కూడా ఆయన వ్యవహరిస్తుంటారు.
ఒకప్పుడు సినిమాలకు డబ్బులిచ్చేందుకు సెపరేట్ గా ఫైనాన్షియర్లు ఉండేవాళ్లు. ఆ తర్వాత కొన్ని ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేవి. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఆ పోకడలు తగ్గిపోతున్నాయి. ఫైనాన్షియర్ దగ్గరకు వెళ్లేబదులు.. ఇలాంటి థర్డ్ పార్టీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు వెళ్లడం బెటర్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు.
ఓవరాల్ గా చూసుకుంటే, గడిచిన కొన్నేళ్లుగా టాలీవుడ్ లో బిజినెస్ మాడ్యూల్ మారిపోయింది. పెట్టుబడి పెట్టే విధానాలు మారిపోతున్నాయి. దీంతో సినిమాల నాన్-థియేట్రికల్ రైట్స్ చుక్కల్ని తాకుతున్నాయి.