మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. బాబు అరెస్ట్ తో పవన్ కల్యాణ్ నిర్మాతల గుండెల్లో గుబులు పట్టుకుంది. వారాహి యాత్ర అంటూ రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దీంతో పవన్ మరోసారి ఏపీ రాజకీయాల వైపు వెళ్తారేమో అనే అనుమానం నిర్మాతలకు మొదలైంది.
దత్తపుత్రుడు వెళ్లాల్సిందే..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. దత్త పుత్రుడు, దత్త తండ్రి అంటూ వైసీపీ నేతలు ఇప్పటికీ వీళ్లిద్దరిపై విమర్శలు చేస్తూనే ఉంటారు. బీజేపీతో పొత్తులో ఉంటూ కూడా, చంద్రబాబుకు నిత్యం టచ్ లో ఉంటాడు పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాల్లో వీళ్లిద్దరిదీ ఓ పొలిటికల్ 'ప్యాకేజీ'.
చంద్రబాబు అరెస్ట్ అయితే కచ్చితంగా ఆ ప్రభావం పవన్ కల్యాణ్ పై పడుతుంది. అతడిలో చలనం వచ్చి తీరుకుంది. ఆల్రెడీ వచ్చింది కూడా. ప్రభుత్వంపై తనదైన శైలిలో ఆయన సీరియస్ అయ్యారు. చూస్తుంటే, పవన్ మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం గ్యారెంటీ. అవసరమైతే బాబు కోసం ఆయన రోడ్డెక్కుతారు. ఇదే ఇప్పుడు నిర్మాతల్ని భయపెడుతోంది. తమ హీరో రోడ్డెక్కితే, తాము రోడ్డున పడతామని టెన్షన్ పడుతున్నారు.
సినిమాల సంగతేంటి..
వారాహి యాత్రలో ఒక దశ పూర్తిచేసిన పవన్ కల్యాణ్, తాజాగా మరోసారి సినిమాలకు కాల్షీట్లు కేటాయించారు. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వచ్చారు. ఆ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమై 24 గంటలు కూడా గడవకముందే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దీంతో ఆ సినిమా యూనిట్ టెన్షన్ లో పడింది. పవన్ షూటింగ్ కు వస్తారా రారా అనే సందిగ్దం నెలకొంది.
'ఉస్తాద్' సినిమా మాత్రమే కాదు.. ఆ మూవీ తర్వాత ఓజీ సినిమాకు పవన్ కాల్షీట్లు ఇచ్చారు. ఆ సినిమా 50శాతం షూట్ పూర్తి చేసుకుంది. పవన్ వస్తే మరో 30శాతం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా సంగతి సరేసరి. కొన్ని నెలలుగా వాళ్లు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఇప్పుడు వీళ్లందర్లో టెన్షన్ మొదలైంది.
సాధారణంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రెస్ నోట్ తో సరిపెడతాడు పవన్ కల్యాణ్. జనసేన ఎకౌంట్ లో ఓ ప్రెస్ నోట్ పెట్టి మమ అనిపిస్తారు. కానీ ఇది సాధారణ ఘటన కాదు, చంద్రబాబు అరెస్ట్. కాబట్టి పవన్ కల్యాణ్ ఏదో ఒకటి చేయాల్సిందే. తన దత్త తండ్రిపై ప్రేమను చాటుకోవాల్సిందే.
పవన్ కచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొనే ఉంటారు. అది అమల్లోకి వస్తే, అతడితో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మరోసారి ఎవరి ఇళ్లల్లో వాళ్లు కూర్చోవాల్సిందే.