'బడిపంతులు' ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ సోషల్ సినిమాల్లో ఒకటి. సాధారణంగా సోషల్ సినిమాల్లో ఎన్టీఆర్ నటన కాస్త ఎక్కువైందనిపిస్తుంది. ఈ తరహా విమర్శకు కూడా అతీతమైన సినిమా 'బడిపంతులు'. ఎన్టీఆర్ ను వృద్ధుడిగా చూపిన సినిమా. ఈ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ చాలా సినిమాల్లో రంగురంగు దుస్తులేసి, బెల్ బాటమ్ ప్యాంట్లతో .. చిందులేశారు. వాటి సంగతలా ఉంటే.. బడిపంతులు సినిమా మాత్రం కల్ట్ హిట్ అయ్యింది. పిల్లల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులున్న మన సమాజంలో బడిపంతులు సినిమా అనునిత్యం గుర్తుకు వచ్చేదిగా నిలిచింది.
ఇక పాటల విషయంలో కూడా బడిపంతులు ఆల్ టైమ్ క్లాసిక్. భారతమాతకు జేజేలూ, బంగారు భూమికి జేజేలూ.. సాంగ్ స్కూళ్లలో పాటల పోటీల్లో ఒకప్పుడు జాతీయ గీతంలా వినిపించేది. ఇప్పటికీ జెమినీ లైఫ్ లో ఎప్పుడైనా ఆ పాటను చూస్తే కలిగే అనుభూతి అద్భుతమైనది. ఇక బుల్లి శ్రీదేవి, బూచాడమ్మా బూచాడు.. అంటూ ఆకట్టుకునే సినిమా కూడా ఇదే అని వేరే చెప్పనక్కర్లేదు.
బడిపంతులు సినిమా సబ్జెక్ట్ లోని డెప్త్ ను చూసినా, ఆ కథను ప్రజెంట్ చేసిన వైనం చూసినా.. దీన్ని ఎవరో చాలా సీనియర్ డైరెక్టర్ తీసి ఉంటాడని అనిపిస్తుంది. అయితే, బడిపంతులును తీర్చిదిద్దింది అప్పటికి యువదర్శకుడు అయిన పీసీ రెడ్డి. పూర్తి పేరు పి.చంద్రశేఖర రెడ్డి. నిన్న స్వర్గస్తులు అయిన చంద్రశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన వస్తే.. ముందుగా చెప్పుకునే సినిమా బడిపంతులు.
వాస్తవానికి ఈ సినిమాకు ఒక హాలీవుడ్ మూలం ఉంది. అయితే ఈ సబ్జెక్ట్ మాత్రం యూనివర్సల్ కాన్సెప్ట్ కావడం, తెలుగులో దీన్ని భావోద్వేగాల మిళితంగా తీయడంతో బడిపంతులు తెలుగు వారికి బాగా నచ్చిన సినిమా అయ్యింది. ఈ సినిమా ఎంత సజీవమైనది అంటే, తెలుగులో 1972లో ఈ సినిమా వస్తే, హిందీలో 2003లో వచ్చిన అమితాబ్, హేమమాలిని, సల్మాన్ ఖాన్ ల సినిమా బాగ్ బన్ కు స్ఫూర్తిగా నిలిచింది.
1972లోనే వచ్చిన మరో మంచి సినిమా 'మానవుడు దానవుడు'. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు దర్శకుడు పీసీ రెడ్డి. దీన్ని కూడా ఆ తర్వాత హిందీలో, తమిళంలో, మలయాళంలో అక్కడి స్టార్ హీరోలు రీమేక్ చేశారు.
80లలో కూడా పీసీ రెడ్డి పలు సినిమాలు చేశారు. ఆయన కెరీర్ లో డెబ్బై సినిమాల వరకూ చేయగా, వాటిలో కృష్ణ హీరోగానే ఇరవైకి పైగా సినిమాలున్నాయి. ఇక పీసీ రెడ్డి వద్ద దర్శకత్వ విభాగంలో పని చేసిన వారు ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లయ్యారు. కోదండరామిరెడ్డి కూడా పీసీ రెడ్డి వద్ద పని చేసిన దర్శకుడే.