ఒకవైపు యూపీలో పేర్ల మార్పిడి పనులను కొనసాగిస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యూపీలోని మధ్యయుగం నాటి ఇస్లాం చక్రవర్తుల పాలనతో వచ్చిన నగరాల పేర్లను ఒకేసారి అయినా మార్చడం లేదు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.
అప్పుడొకటి, అప్పుడొకటి చేస్తూ ఉంటారనమాట. అన్నీ ఒకే రోజు మారిస్తే, దాని ద్వారా ఏదైనా వచ్చే ప్రయోజనం ఉంటే అది అప్పుడే అయిపోతుంది. అదే ఈ పేర్ల మార్పిడి ప్రక్రియను కొన్నాళ్లకు ఒకసారి చేపడుతూ ఉంటే.. ఒక్కోసారి ఒక్కో ఊరు పేరు మారుస్తూ ఉంటే.. ఎప్పటికిప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఏవైనా ఉంటే పొందవచ్చనే స్ట్రాటజీ కాబోలు!
యోగి ప్రభుత్వం చేపట్టిన పేర్ల మార్పిడి ప్రక్రియ ఇంకా పూర్తయినట్టుగా లేదు. ఆ సంగతలా ఉంటే.. ఏపీలో బీజేపీకి అధికారం ఇచ్చినా పేర్లు మార్చే పని ఉందట. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జిన్నా టవర్ మీద బీజేపీ చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
స్వతంత్రానికి పూర్వమెప్పుడో నిర్మించిన జిన్నా టవర్ .. పేరు ఇన్నాళ్లకు బీజేపీకి కంటగింపుగా మారింది. ఈ పేర్ల మార్పిడి రాజకీయంతో ప్రయోజనాలను వెదుక్కొంటూ ఉన్నట్టుగా ఉంది. ఇప్పటికే దీనిపై రాజకీయం మొదలుపెట్టిన బీజేపీ, మరో హామీని ప్రకటించింది. తమకు అధికారం ఇస్తే జిన్నా టవర్ పేరు మారుస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.
అధికారం ఇస్తే.. రాష్ట్ర రెవెన్యూని ఉపయోగించుకుని యాభై రూపాయలకు చీప్ లిక్కర్ ను అందించే పనితో పాటు, జిన్నా టవర్ పేరును కూడా మారుస్తారనమాట. మొత్తానికి భలే హామీలే వస్తున్నాయి బీజేపీ నుంచి! ఒకటి కాదు రెండు కాదు, ఐదు కాదు పది కాదు, పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా వంటి హామీలను గతంలో బీజేపీ నేతలు ఇచ్చారు. అవి ఎలాగూ నిలబెట్టుకోలేదు. వాటి బదులు ఇప్పుడు చీప్ లిక్కర్, పేర్లమార్పిడి వంటి హామీలతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు.