ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. ప్రత్యర్థుల అవినీతి, అక్రమాలపై నోరు పారేసుకునే సోము వీర్రాజు కుటుంబ సభ్యుడిపై చీటింగ్ కేసు నమోదు కావడం గమనార్హం.
విశాఖలో అధికార పార్టీ భూదందాలకు పాల్పడుతోందని పదేపదే వీర్రాజు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే భూఆక్రమణపై వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంపై కేసు నమోదు కావడం గమనార్హం. దీంతో ప్రత్యర్థులు వీర్రాజును టార్గెట్ చేస్తున్నారు.
రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ తన భూమిపై వీర్రాజు అల్లుడు అక్రమంగా లోన్ తెచ్చుకున్నాడని వాపోతున్నారు. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐలో కవల వెంకట నరసింహం లోన్ తీసుకున్నారని గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదుపై కొవ్వూరు టౌన్ పోలీసులు సమగ్రంగా విచారించారు. అనంతరం వెంకట నరసింహంపై వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. అల్లుడి మోసంపై మామ ఏ విధంగా స్పందిస్తారో మరి!