శ్రీ‌వారికి కేంద్రం మూడు నామాలు!

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి కేంద్ర ప్ర‌భుత్వం మూడు నామాలు పెట్టింది. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో టీటీడీకి కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లుతోంది. హిందుత్వానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పుకునే బీజేపీ, త‌న నేతృత్వంలో న‌డుస్తున్న కేంద్రంలోని…

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి కేంద్ర ప్ర‌భుత్వం మూడు నామాలు పెట్టింది. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో టీటీడీకి కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లుతోంది. హిందుత్వానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పుకునే బీజేపీ, త‌న నేతృత్వంలో న‌డుస్తున్న కేంద్రంలోని ప్ర‌భుత్వం మాత్రం ఆచ‌ర‌ణ‌లో అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంపై విమ‌ర్శ‌లొస్తున్నాయి. కేంద్ర హోంశాఖ నిర్వాకం వ‌ల్ల టీటీడీకి విదేశాల నుంచి విరాళాలు ఆగిపోయాయి.

టీటీడీకి సంబంధించి ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ రెన్యువ‌ల్‌ను స‌కాలంలో కేంద్ర హోంశాఖ చేయ‌లేదు. ఈ కార‌ణంగా ఏడాదిగా టీటీడీకి విదేశీయుల నుంచి విరాళాలు సేక‌రించ‌డానికి వీలు కాలేదు. వివిధ స్వ‌చ్ఛంద‌, ధార్మిక, సేవాగుణంతో ఏర్పాటు చేసిన ట్ర‌స్టులు విదేశాల నుంచి నిధులు స్వీక‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) అనే లైసెన్స్ ఉంటుంది. 

విదేశాల నుంచి ముఖ్యంగా మ‌త మార్పిడులకు ఎక్కువ నిధులు అందుతున్నాయ‌నే అనుమానంతో మోడీ స‌ర్కార్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. దీంతో చాలా సంస్థ‌ల‌కు ఎఫ్‌సీఆర్ఏ ల‌భించ‌డం, రెన్యువ‌ల్ కావ‌డం క‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో టీటీడీకి 2020 డిసెంబరులో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు గడువు ముగిసింది. 

దేవస్థానం అధికారులు త‌మ బాధ్య‌త‌గా సకాలంలోనే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసినా…కేంద్ర‌హోంశాఖ నిర్ల‌క్ష్యంతో రెన్యువ‌ల్‌కు నోచుకోలేదు. దీంతో నిధుల స్వీక‌ర‌ణ‌కు అడ్డంకిగా మారింది. ప్ర‌తి ఏడాది రూ.50 కోట్లకుపైగా విదేశీయుల నుంచి విరాళాలు అందుతున్న‌ట్టు టీటీడీ అధికారులు చెప్పారు. ఇప్పుడా ఆదాయం టీటీడీ కోల్పోవాల్సి వ‌చ్చింది.