ప్ర‌ధానితో భేటీలో గొడ‌వ‌!

ప్ర‌ధాని మోడీతో భేటీకి సంబంధించి మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. ప్ర‌ధానితో భేటీ అయిన ఐదు నిమిషాల‌కే త‌మ మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు ఆయ‌న చెప్ప‌డం, అందుకు సంబంధించిన వీడియో…

ప్ర‌ధాని మోడీతో భేటీకి సంబంధించి మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. ప్ర‌ధానితో భేటీ అయిన ఐదు నిమిషాల‌కే త‌మ మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు ఆయ‌న చెప్ప‌డం, అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అంతేకాదు, ప్ర‌ధాని గురించి కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన‌డం తీవ్ర వివాదాస్ప‌మైంది.

రైతుల ఆందోళ‌న‌కు మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే. సాగు చ‌ట్టాల‌ను తీసుకొచ్చిన కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ఆయ‌న త‌ర‌చూ త‌ప్పు ప‌డుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హ‌రియాణాలోని చ‌ర్ఖీదాద్రీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఆ స‌మావేశంలో ఆయ‌న ఏమ‌న్నారంటే…

‘ప్రధానితో భేటీ అయిన ఐదు నిమిషాలకే వాగ్వాదం మొదలైంది. 500 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని నేను చెప్పాను. ఓ కుక్క చనిపోయినా మీరు సంతాప లేఖ పంపుతారు కదా అని అడిగాను. వారు నాకోసం చనిపోయారా అని మోడీ అహంకారంతో ప్రశ్నించారు. దానికి నేను ‘అవును.. మీరే పాలకులు కాబట్టి’ అని సమాధానమిచ్చాను. చివరకు గొడవతో ఆ సమావేశం ముగిసింది. అమిత్‌ షాను కలవమని ప్రధాని నాకు చెప్పారు’  అని పేర్కొన్నారు.

ఇంత‌టితో గ‌వ‌ర్న‌ర్ ఊరుకోలేదు. త‌న అక్క‌సును మ‌రింత‌గా వెళ్ల‌గ‌క్కారు. అమిత్‌ షాను కలిసిన నేప‌థ్యంలో త‌మ మ‌ధ్య జ‌రిగిన   సంభాషణనూ వివరించి సంచ‌ల‌నం సృష్టించారు. ‘ఆయనకు(మోడీ) మతి తప్పింది. కొందరు ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏదో రోజు ఆయనకు వాస్తవం బోధపడుతుంది. మీరు ఇవేం పట్టించుకోకండి. మమ్మల్ని కలుస్తూ ఉండండి అని ‘షా’ నాతో చెప్పారు’  అని మాలిక్‌ ఆ వీడియోలో చెప్పారు.

ప్ర‌ధాని మోడీ, అమిత్‌షా మ‌ధ్య విభేదాలున్నాయ‌ని గ‌వ‌ర్న‌ర్ మాట‌ల ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌ధానికి సంబంధించిన మీటింగ్ వివ‌రాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం, అనంత‌రం అమిత్‌షా చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా బ‌హిరంగ ప‌ర‌చ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మొత్తానికి ప్ర‌ధానితో గొడ‌వ ప‌డ్డ‌ట్టు మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ బ‌హిరంగ ప‌రిచారు.