ఆస్కార్ కోసం దిల్ రాజు ఏం చేయబోతున్నాడు..?

బలగం.. తెలుగు రాష్ట్రాల్ని ఓ ఊపు ఊపిన సినిమా. తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి ఈ సినిమాను ప్రదర్శించారంటే, జనబాహుళ్యంలోకి బలగం ఎంతలా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ…

బలగం.. తెలుగు రాష్ట్రాల్ని ఓ ఊపు ఊపిన సినిమా. తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి ఈ సినిమాను ప్రదర్శించారంటే, జనబాహుళ్యంలోకి బలగం ఎంతలా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ రానంతగా, బలగం సినిమాకు లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డులొచ్చాయి.

అందుకే ఆస్కార్ పై కూడా ఆశ పెట్టుకున్నాడు దిల్ రాజు. తన కూతురు నిర్మాతగా మారి తీసిన ఈ సినిమాతో ఆస్కార్ కొట్టాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వస్తే, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా కార్తికేయతో మాట్లాడి మరీ తెలుసుకున్నాడు. ఇదంతా బలగం సినిమా కోసమే.

అందరూ ఊహించినట్టుగానే బలగం సినిమాను ఆస్కార్ ఎంట్రీ కోసం సెలక్షన్ కమిటీకి పంపించారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 16 మంది సభ్యులతో కూడిన బృందం వచ్చే ఏడాది ఆస్కార్ కోసం ఇండియా నుంచి పంపించే సినిమాను ఎంపిక చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 22 సినిమాల్ని పరిశీలించింది.

తెలుగు నుంచి బలగం, దసరా వెళ్లాయి. వీటితో పాటు కేరళ స్టోరీ, రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహానీ, మిసెస్ ఛటర్జీ వెర్సెస్ నార్వే, మరాఠీ నుంచి వాల్వి, బాప్లీలోక్ లాంటి సినిమాలు వెళ్లాయి. వీటిని క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ.. మలయాళంలో వచ్చిన 2018 అనే సినిమాను ఆస్కార్ కు అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది.

దిల్ రాజు ఏం చేయబోతున్నారు..?

ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ కు వెళ్లే అవకాశం బలగం సినిమాకు దక్కలేదు. అలాఅని దీనికి పూర్తిగా తలుపులు మూసుకుపోలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఇలానే జరిగింది. అధికారిక ఎంట్రీగా అది ఎంపికవ్వలేదు. దీంతో మేకర్స్ స్వయంగా తమ సినిమాను వ్యక్తిగత స్థాయిలో ప్రమోట్ చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో హాలీవుడ్ మీడియాను ఎట్రాక్ట్ చేశారు. దీని కోసం అక్కడ 2 పీఆర్ సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఎక్కువమంది హాలీవుడ్ క్రిటిక్స్ కు తమ సినిమాను చేరువచేశారు.

ఆర్ఆర్ఆర్ యూనిట్ కష్టం ఫలించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు-నాటుకు ఆస్కార్ వరించింది. ఇప్పుడు ఇదే ఫార్మాట్ ను దిల్ రాజు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు తెలుసుకున్న దిల్ రాజు, బలగం కోసం అమెరికా వెళ్లి డబ్బు-సమయం ఖర్చు చేస్తారా లేక ఇక్కడితో ఆపేస్తారా అనేది తేలాల్సి ఉంది.

చాలామంది  అభిప్రాయం మాత్రం దిల్ రాజు ఓ ప్రయత్నం చేయాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే, అతడి బ్యానర్ కు మళ్లీ బలగం లాంటి సినిమా ఎప్పుడొస్తుందో ఏంటో!