ఎన్టీవోడు.. నాగిగాడు.. బాలయ్య మళ్లీ కెలికాడు

అక్కినేని నాగేశ్వరరావుపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి సరైన వేదిక కోసం బాలయ్య ఎదురుచూస్తున్నారనే విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. గతంలో చేసినట్టు ప్రెస్ నోట్ విడుదల చేయకుండా, మీడియా సమక్షంలో మాట్లాడాలని బాలయ్య…

అక్కినేని నాగేశ్వరరావుపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి సరైన వేదిక కోసం బాలయ్య ఎదురుచూస్తున్నారనే విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. గతంలో చేసినట్టు ప్రెస్ నోట్ విడుదల చేయకుండా, మీడియా సమక్షంలో మాట్లాడాలని బాలయ్య నిర్ణయించుకున్నారు.

ఆ అవకాశం రానే వచ్చింది. ఈరోజు బాలయ్య ముందు మీడియా మైకులు వాలాయి. బాలయ్య అందుకున్నారు. 'అక్కినేని-తొక్కనేని' అంటూ తను చేసిన విమర్శల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమర్థన మరింత వెగటుగా, వివాదాస్పదంగా మారింది.

ఇష్టమైన వాళ్లను ఎలాగైనా పిలుచుకోవచ్చనేది బాలయ్య వాదన. “ఎన్టీఆర్ ను అభిమానులు ఎన్టీవోడు అని పిలుస్తారు. అలాగే ఏఎన్నార్ నాగి గాడు అని పిలుస్తారంటూ” కొత్త వాదన ఎత్తుకున్నారు బాలయ్య. ఎన్టీవోడు అనే పదప్రయోగం అందరికీ తెలిసిందే. కానీ ఈ 'నాగిగాడు' అనే పదప్రయోగం మాత్రం బాలయ్య నోటి నుంచే వింటున్నాం. ఏఎన్నార్ ను అభిమానులెవ్వరూ నాగిగాడు అని పిలవలేదు.

ఇష్టమైన వాళ్లను ఇలానే పిలుచుకుంటారనేది బాలయ్య వాదన. అందుకే తను ఫ్లోలో అక్కినేని-తొక్కనేని అన్నానంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు బాలయ్య. అక్కినేని అంటే తనకు అభిమానం ఉందని, అందుకే అలా పిలుచుకున్నానన్నారు. దీంతో బాలయ్యపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది.

మనసులో ఆప్యాయత ఉంటే బయటకు బూతులు తిట్టొచ్చా అనేది నెటిజన్ల మాట. 'నందమూరి హీరోలంటే తనకు చాలా ఇష్టమని, కాబట్టి నందమూరి పేరును కాస్త మార్చి ఇంకోరకంగా తను సంభోదిస్తే ఓకేనా' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అక్కినేని ఇష్టముంటే దాన్ని మరో రకంగా చూపించాలని, ఇలా నిండుసభలో అవమానకరంగా మాట్లాడితే అది ఆప్యాయత కిందకు రాదని మరో నెటిజన్ స్పందించాడు.

బాలకృష్ణకు అందరికంటే తన తండ్రి ఎన్టీఆర్ అంటే ఇష్టం. మైక్ దొరికితే నాన్నగారు అంటూ డప్పు మొదలుపెడతారు బాలయ్య. మరి గుండెల నిండా అంత ఆప్యాయత-ప్రేమ ఉన్న ఎన్టీఆర్ ను కూడా వేదికపై బూతులు తిట్టొచ్చుకదా అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో కామెంట్స్ లో ఇదే హైలెట్ గా మారింది.

మొత్తమ్మీద బాలకృష్ణ చేసిన కామెంట్స్, అతడి గత వ్యాఖ్యల్ని సమర్థించినట్టు లేవు. తిరిగి కొత్త వివాదాల్ని రేకెత్తించినట్టున్నాయి. వీటికి తోడు అక్కినేనికి అతడి కుటుంబంలో ఆప్యాయత దక్కలేదంటూ అతిపెద్ద విమర్శ చేసిన బాలయ్య, కొత్త వివాదానికి ఆజ్యం పోశారు.