అడిగిన వాటికన్నింటికీ ఠక్కున జవాబు చెబుతుంటే బాలమేధావి అని మెచ్చుకుంటాం, ఇంకాస్త ఎక్కువ చురుగ్గా కనపడితే అబ్బో వీడు ఐన్ స్టీన్ అంతోడు అంటాం. ఐన్ స్టీన్ కంటే ఇంకాస్త ఎక్కువ ఈ రిషి శివప్రసన్న.
వయసు 8 ఏళ్లు. కానీ పాతికేళ్ల ప్రతిభావంతులు ఆలోచించినదాని కంటే మిన్నగా రిషి ఆలోచనలు ఉంటాయి. అందుకే ఎనిమిదేళ్లకే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం అందుకున్నాడు రిషి. అంతకు మందే యూకేలోని మెన్సాలో సభ్యుడయ్యాడు.
ఇంతకీ మనోడి ఐక్యూ లెవల్స్ ఎంతనుకున్నారు. రిషి ఐక్యూ 180. అది ఐన్ స్టీన్ ఐక్యూ కంటే ఎక్కువ. సహజంగా ప్రతిభావంతులైన యువతకి ఐక్యూ సగటు 130. అయితే రిషికి ఎనిమిదేళ్ల వయసులోనే దానికంటే 50 పాయింట్లు ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది. అదీ మనోడి టాలెంట్.
బెంగళూరుకి చెందిన రిషి ఐదేళ్ల నుంచే సాఫ్ట్ వేర్ పై అవగాహన పెంచుకున్నాడు. కోడింగ్ నేర్చుకున్నాడు. సొంతగా 3 ఆండ్రాయిడ్ అప్లికేషన్లు తయారుచేశాడు. ‘ఎలిమెంట్ ఆఫ్ హర్థ్’ అనే పుస్తకాన్ని రాశాడు. రిషి తండ్రి శివ ప్రసన్న కుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్. తల్లి ఐటీ ఇంజినీర్. ఐటీపై చిన్నప్పటినుంచే రిషికి ఆసక్తి పెరిగింది. తల్లి దగ్గర మెళకువలు నేర్చుకున్నాడు.
సొంతగా యూట్యూబ్ ఛానెల్ రన్ చేసే రిషి.. ఆ ఛానెల్ లో చిన్నా పెద్దా అందరికీ సైన్స్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటాడు, వివరణలు ఇస్తుంటాడు. పుస్తకాల పురుగు రిషి. మిగతావారికి కూడా పుస్తకాలు చదవమని సలహా ఇస్తుంటాడు. సైంటిస్ట్ అవ్వాలనే తన ఆశను కచ్చితంగా నెరవేర్చుకుంటానంటాడు ఈ బాలమేధావి.