భారతీయులకు మరో డోస్ టీకా అవసరమా..?

భారత్ లో ఇప్పటికే అందరూ రెండు డోస్ ల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. చాలామందికి ప్రికాషనరీ డోస్ కింద మూడో డోస్ కూడా పడింది. ఇప్పుడు మళ్లీ నాలుగో డోస్ విషయంలో చర్చ జరుగుతోంది.…

భారత్ లో ఇప్పటికే అందరూ రెండు డోస్ ల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. చాలామందికి ప్రికాషనరీ డోస్ కింద మూడో డోస్ కూడా పడింది. ఇప్పుడు మళ్లీ నాలుగో డోస్ విషయంలో చర్చ జరుగుతోంది. అసలు భారతీయులకు నాలుగో డోస్ అవసరమా..? మన దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు నాలుగో డోస్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయా..?

నిపుణులు ఏమంటున్నారంటే..?

వ్యాక్సిన్ అవసరమే, కానీ అదే పనిగా టీకాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే భారతీయులు మూడు డోస్ ల టీకా తీసుకున్నారు. అంటే మూడుసార్లు మన శరీరంలోని టి-సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి కొవిడ్ టీకా అవసరం లేదంటున్నారు. భారతీయులు నాలుగో డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది వీళ్ల వాదన.

ప్రస్తుతం భారత్ లో ఉన్న కొవిడ్ వేరియంట్ రూపాంతరం చెందలేదు, అలా రూపాంతరం చెంది దానివల్ల కొత్త ఇబ్బందులు తలెత్తినా, లేదా సార్స్ కుటుంబానికి భిన్నమైన వైరస్ విజృంభించినా అప్పుడు నాలుగో డోస్ గురించి ఆలోచించాలని చెబుతున్నారు. మ్యుటెంట్ లు మారినా కూడా ఇన్ఫెక్షన్లు లేవని, అందుకే నాలుగో డోస్ ని లైట్ తీసుకోవచ్చని అంటున్నారు. మన శరీరంలో ఉన్న టి-సెల్స్ ఇమ్యూనిటీని పూర్తిగా నమ్మొచ్చని భరోసా ఇస్తున్నారు.

అయితే వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మాస్కులు ధరించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొవిడ్ పదే పదే వారిపై దాడి చేయకుండా రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. నాలుగో డోస్ విషయంలో మాత్రం తొందరపడొద్దని చెబుతున్నారు.