Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య నోట బీప్... విరుచుకుపడుతున్న టాలీవుడ్

బాలయ్య నోట బీప్... విరుచుకుపడుతున్న టాలీవుడ్

టాలీవుడ్ లో మరో ముసలం పుట్టుకొచ్చింది. బాలకృష్ణ చేసిన ఒకే ఒక్క కామెంట్ తో ఇప్పుడు టాలీవుడ్ అట్టుడికిపోతోంది. తలసానితో జరుగుతున్న చర్చల కోసం తనను ఎవ్వరూ పిలవలేదన్నారు బాలయ్య. అంతటితో ఆగితే సరిపోయేది. మంత్రి తలసానితో కలిసి కొంతమంది భూములు పంచుకుంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన బీప్ వర్డ్ కూడా మీడియా కెమెరాలో రికార్డ్ అయింది.

బాలయ్య వ్యాఖ్యలతో టాలీవుడ్ భగ్గుమంది. ఆయనతో సాన్నిహిత్యం ఉన్న సి.కల్యాణ్ లాంటి వ్యక్తులు సుతారంగా ఆ విషయాన్ని పక్కకునెట్టే ప్రయత్నం చేయగా.. నాగబాబు లాంటి వ్యక్తులు మాత్రం గట్టిగా విరుచుకుపడ్డారు. ముందుగా సి.కల్యాణ్ ఏమన్నారో చూద్దాం.

"ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం. మాకు పని జరగడం ముఖ్యం. ఈ మేటర్ చిన్న నాన్-సింక్ లో ఉంది. బాలయ్య వస్తానంటే ఎవరైనా కాదంటారా. చిరంజీవి లీడ్ తీసుకున్నారు అదలా నడుస్తోంది. అంతేతప్ప ఇది ఆర్టిస్టుల్ని పిలిచే మీటింగ్ కాదు. నాకు హీరో అంటే బాలయ్యే. మీటింగ్స్ గురించి ఎప్పటికప్పుడు బాలయ్య బాబుకు చెబుతూనే ఉన్నాను. మీడియా గుచ్చిగుచ్చి అడిగితే నన్ను పిలవలేదన్నారు బాలయ్య. అంతే."

ఇలా బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు సి.కల్యాణ్. అయితే నాగబాబు మాత్రం ఊరుకోలేదు. ఎప్పట్లానే వీడియో రిలీజ్ చేసిన నాగబాబు.. తన మాటలతో బాలయ్యను కడిగిపారేశారు. ఇండస్ట్రీలో బాలయ్య కింగ్ కాదని, కేవలం ఓ హీరో మాత్రమేనని అన్న నాగబాబు.. తక్షణం బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

"భూములు పంచుకోవడానికే మీటింగ్ అని బాలయ్య అనడం నన్ను బాధించింది. అర్జెంట్ గా బాలయ్య ఈ మాటను వెనక్కు తీసుకోవాలి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడ్డం కరెక్ట్ కాదు. నోరు కంట్రోల్ చేసుకొని మాట్లాడండి బాలకృష్ణ గారు. ఇండస్ట్రీ బాగు కోసం వెళ్లారు తప్ప భూములు పంచుకోవడానికి వెళ్లలేదు. నన్ను కూడా ఎవ్వరూ పిలవలేదు. కేవలం ఇండస్ట్రీనే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మీరు అవమానించారు."

అటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా దీనిపై స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలపై పరిశ్రమ పెద్దలు స్పందించిన తర్వాత తను కూడా రియాక్ట్ అవుతానన్నారు. మరోవైపు సురేష్ బాబు, రాజమౌళి లాంటి వ్యక్తులు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించకుండా వెళ్లిపోయారు.

ఓవరాల్ గా చూసుకుంటే.. బాలయ్య వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇండస్ట్రీ తెరుచుకుంటున్న వేళ.. బాలయ్య ఈ వ్యాఖ్యలు చేయడం అటు కొంతమంది మేకర్స్ ను ఇబ్బంది పెట్టడంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి.

దీనిపై ఇప్పటికే మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు. వివాదం గంటగంటకు ముదిరిపోతోంది. ఇది ఏ మలుపు తీసుకుంటుందనే విషయాన్ని పక్కనపెడితే.. బాలయ్య అలా "బీప్" వర్డ్ వాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరైనా దీన్ని ఖండించాల్సిందే. 

తప్పుడు వార్తలు రాసిన మీడియాపై సమగ్ర విచారణ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?