రీసెంట్ గా తన ప్యానెల్ ను ఘనంగా ప్రకటించారు ప్రకాష్ రాజ్. తను అధ్యక్ష బరిలో నిలవడమే కాకుండా.. జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులతో పాటు 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఎవరు పోటీస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఇన్నాళ్లూ తనకు మద్దతుగా ఉన్న బండ్ల గణేశ్ నుంచి వ్యతిరేకత వస్తుందని మాత్రం ప్రకాష్ రాజ్ ఊహించలేకపోయాడు.
అవును.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బండ్ల గణేశ్ తప్పుకున్నాడు. అతడికేదో మంచి సీటు ఇవ్వలేదని ఆయన తప్పుకోలేదు. ప్యానెల్ లోకి జీవిత రాజశేఖర్ రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
తనకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఎన్నోసార్లు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జీవిత రాజశేఖర్ ను ప్రకాష్ రాజ్ ఎంకరేజ్ చేయడం తనకు ఇష్టంలేదని బండ్ల కామెంట్ చేశారు. అందుకే ఇప్పుడు ఏకంగా ఆమెపై పోటీకి దిగుతున్నారు. రాబోయే మా అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు.
“మాట తప్పను. మడమ తిప్పను. నాది ఒకటే మాట -ఒకటే బాట. నమ్మడం -నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను. పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ.”
ఇలా తను పోటీ చేస్తున్న విషయాన్ని ప్రకటించాడు బండ్ల. తాజా ప్రకటనతో ప్రకాష్ రాజ్ అనుచర వర్గం నుంచి బండ్ల తప్పుకున్నట్టయింది. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదని, తనకు ఓసారి అవకాశం ఇస్తే, వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించుకున్నారు బండ్ల.
“గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం. అదే మా నిజమైన అభివృద్ది”
మొత్తమ్మీద బండ్ల బయటకు రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు గట్టి దెబ్బ తగిలినట్టయింది. ఈ విషయాన్ని మొన్న జరిగిన ప్రెస్ మీట్ లోనే పరోక్షంగా వెల్లడించారు ప్రకాష్ రాజ్. తను చాలామందికి ఫోన్ చేశానని, చాలామంది తనతో కలిసి రావడానికి ఇష్టపడలేదని ఆయన తెలిపాడు. ఆ ప్రెస్ మీట్ జరిగిన కొన్ని రోజులకే బండ్ల బయటకొచ్చి సొంత కుంపటి పెట్టారు.
బండ్ల సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక తెరవెనక నుంచి ఎవరైనా బండ్లను రెచ్చగొట్టి ఇలా ముందుకుతోశారా అనే అంశంపై టాలీవుడ్ పెద్దలు ఆరాలు తీస్తున్నారు.