జగన్ మంత్రి వర్గానికి పవన్ కల్యాణ్ కి ప్రత్యక్ష సంబంధమేమీ లేదు కానీ, పవన్ పుణ్యాన ఇప్పుడు ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశముంది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఆయనపై వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పట్లో నారా లోకేష్ ని మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎంత పబ్లిసిటీ వచ్చిందో.. పవన్ కల్యాణ్ ని ఓడించిన నాగిరెడ్డికి, గ్రంథి శ్రీనివాస్ కి కూడా అంతే ప్రచారం లభించింది.
విశాఖ జిల్లా గాజువాకలో పవన్ కల్యాణ్ పై నాగిరెడ్డి విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ పై గ్రంథి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఈ రెండు చోట్లా పవన్ ని ఓడించి వారిద్దరూ రియల్ హీరోలయ్యారు. వీరిలో ఇప్పుడు ఒకరికి జగన్ కేబినెట్ లో చోటు లభిస్తుందనే ప్రచారం మొదలైంది. పవన్ ని ఓడించడమే వీరి ఫస్ట్ క్రెడిట్.
గాజువాక కంటే భీమవరంలో పవన్ తన గెలుపుపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అక్కడ గ్రంథి శ్రీనివాస్ ఆయనపై విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13చోట్ల వైసీపీ జెండా రెపరెపలాడింది. ఈ జిల్లా నుంచి ఆళ్ల నాని, తానేటి వనిత, శ్రీరంగనాథ రాజు మంత్రి పదవుల్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు లేదా ఇద్దరు మంత్రి పదవులు కోల్పోతారని తాజా సమాచారం. అలా పశ్చిమ నుంచి పోయిన పదవుల్లో ఒకటి గ్రంథి శ్రీనివాస్ దక్కించుకుంటారని తెలుస్తోంది.
జగన్ హామీ ఇచ్చారా..?
భీమవరంలో పవన్ ని ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని గతంలో జగన్, గ్రంథి శ్రీనివాస్ కి హామీ ఇచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అందులోనూ భీమవరంలో పవన్ రెండోసారి పోటీ చేయకుండా ఉండాలంటే, అక్కడ జనసేనను నిలువరించాలంటే గ్రంథికి మంత్రి పదవి కావాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో జనసేన అంటేనే.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోతున్నారు గ్రంథి.
ఇటీవల జనసైనికుల్ని ఆయన తాలిబన్లతో కూడా పోల్చారు. అంతే కాదు, తన పేరు చెబితేనే పవన్ వణికిపోతారని, జగన్ ని కామెంట్ చేసే అర్హత ఆయనకు లేదని.. పలుమార్లు గ్రంథి జనసేనానిపై విరుచుకుపడ్డారు.
మొత్తమ్మీద.. మంత్రి పదవులు అందుకోడానికి ఎవరెవరు వారి అర్హతలను ఏకరువు పెడుతున్న సందర్భంలో గ్రంథి శ్రీనివాస్ మాత్రం పవన్ కల్యాణ్ కోటాలో తనకు పదవి కావాలని అడగటం విచిత్రం. మరి జగన్ మనసులో ఏముందో మరికొన్నిరోజులాగితే తెలుస్తుంది.