కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నిర్మాణంలో వున్న సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో కార్తికేయ సరసన నేహా శెట్టి కథానాయికగా నటించారు. ఈ సినిమాను నుంచి ఓ పాట ను విడుదల చేసారు.
'వెన్నెల్లో ఆడపిల్ల…కవ్వించే కన్నెపిల్ల…కోపంలో చూస్తే ఎల్లా…క్షణంలో అగ్గిపుల్ల…' అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. మణిశర్మ అందించిన బాణీతో ఈ 'వెన్నెల్లో ఆడపిల్ల…' పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.
'వెన్నెల్లో ఆడపిల్ల…' లిరికల్ వీడియోలో కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ అందంగా ఉంది. ప్రేమికుల మధ్య రొమాంటిక్ మూమెంట్స్, ఫీలింగ్స్ చక్కగా ఆవిష్కరించారు. పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “మణిశర్మ అద్భుతమైన బాణీ అందించారు. ప్రేమ కథలోని కీలకమైన సందర్భంలో వస్తుందీ పాట. కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ పాటలో హైలైట్ అవుతాయి. 'వెన్నెల్లో ఆడపిల్ల…' పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది.
గోదావరి తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ పాటను చిత్రీకరించాం. ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో తీసిన పాట ఇది. సినిమాలో కామెడీ కూడా బాగుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని గర్వంగా చెబుతాం. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని చెప్పారు.
ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.