రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ లిస్ట్ లో సి ఇ ఓ అన్నది టాప్ లో వుందని ‘గ్రేట్ ఆంధ్ర’ ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్,విడుదల తేదీలను ఈ ఉగాదికి కానీ లేదా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కానీ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడుతూ సిఇఓ అన్నది కూడా కన్సిడరేషన్ లో వున్న టైటిళ్లలో ఒకటి అన్నారు. సంక్రాంతికి ఎలాగైనా విడుదల చేయాలన్నది తమ ప్రయత్నమన్నారు. దర్శకుడు శంకర్ అదే పని మీద వున్నారని చెప్పారు.
బలగం సినిమా మంచి ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యలో ఆయన ఇంటర్వూ ఇచ్చారు. బలగం కథ ను నమ్మి, భారీగా తీసి దాని అసెన్స్ చెడగొట్టకుండా తీసామన్నారు. తాత పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకోవచ్చు అని, ఆ మేరకు మిగిలిన పాత్రలు అన్నీ మారిపోతాయని, సినిమా అసలు సిసలు ఆత్మ పోతుందని అన్నారు. తెలంగాణ పల్లె జ్ఙాపకాలు తనకు, తన సోదరుడు శిరీష్ కు పదిలంగా వున్నాయని, అవే తమకు ఈ కథ ను కనెక్ట్ చేసాయన్నారు. కథను నమ్మి, కథను చెప్పిన విధానాన్ని నమ్మి, కమెడియన్ వేణు ను దర్శకుడిగా ఓకె చేసామన్నారు.
తన సోదరుడు శిరీష్, ఆయన భార్య డబుల్ పాజిటివ్ దశలోనే సినిమా చూసి, కంట తడి పెట్టుకున్నారని, అప్పుడే ఈ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని నమ్మామని వెల్లడించారు. ఎక్కడా రాజీ పడదలేదని, సినిమాటిక్ వ్యవహారాలు అస్సలు వద్దని ముందే వేణుకు చెప్పామని అన్నారు. ఒక్క చిన్న షెడ్యూలు ఆరంభంలో తీసినపుడు అది సినిమాటిక్ గా వుంటే పక్కన పెట్టేసి మళ్లీ గ్రౌండ్ లెవెల్ లో తీసేలా చూసామన్నారు. ఒక పాట కోసమే చాలా టైమ్ తీసుకున్నామన్నారు.
తమ వారసులతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించామని, ఇది వారికి తొలి సినిమాగా మంచి బూస్టప్ ఇచ్చిందని దిల్ రాజు చెప్పారు. మొత్తం మూడు గంటల ఫుటేజ్ వచ్చిందన్నారు. సినిమాకు నాన్ థియేటర్ ఇన్ కమ్ తోనే లాభం వచ్చేసిందని, తన తొలి సినిమాకు ఇంత లాభం రాలేదని, తమ పిల్లల సినిమాకు మంచి లాభాలు వచ్చాయని అన్నారు.
వేణుతో మరో సినిమా తన బ్యానర్ లో తీస్తున్నా అని, పెద్ద సినిమా, స్పాన్ వున్న సినిమా అని వెల్లడించారు. వేణు శ్రీరామ్ తో సినిమా ఫిక్స్ అయిందని త్వరలో వెల్లడిస్తా అని చెప్పారు.
రాజకీయాల్లోకి వస్తానని అందరూ రాస్తున్నారని, అయితే అది ప్రస్తుతం తాను చెప్పలేనని, తనకు ఎంతో మంది బంధువులు అన్ని పార్టీల్లో పదవుల్లో వున్నారని, అలాగే స్నేహితులు వున్నారని వెల్లడించారు. అయితే డైరక్షన్ చేయాలని మాత్రం తాను ఎప్పటికీ అనుకోనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.