ఒక్క రిలీజ్ లేదు.. అప్పుడే మూడో సినిమా?

హీరోయిన్లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే వరుసగా ఆఫర్లు వస్తుంటాయి. ఇక రిలీజైన సినిమా హిట్టయితే, తారాజువ్వలా దూసుకుపోవడమే. మొన్నటికిమొన్న శ్రీలీల, కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది.…

హీరోయిన్లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే వరుసగా ఆఫర్లు వస్తుంటాయి. ఇక రిలీజైన సినిమా హిట్టయితే, తారాజువ్వలా దూసుకుపోవడమే. మొన్నటికిమొన్న శ్రీలీల, కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు మరో హీరోయిన్ విషయంలో ఇదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

పేరు భాగ్యశ్రీ.. రవితేజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. సినిమా ఇంకా సెట్స్ పై ఉంది. అంతలోనే ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఆల్రెడీ ఈమెను తీసుకున్నారు.

ఇప్పుడు మరో అవకాశం అందుకుంది ఈ బ్యూటీ. అన్నీ అనుకున్నట్టు జరిగితే దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించనుంది భాగ్యశ్రీ.

ప్రస్తుతం లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న దుల్కర్, త్వరలోనే సుధాకర్ చెరుకూరి బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్ గా అనుకుంటున్నారు.

ఇలా ఒక్క సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వకుండానే, వరుసపెట్టి అవకాశాలు అందుకుంటోంది భాగ్యశ్రీ. రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ హిట్టయితే, ఈ అమ్మాయికి మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి.