ఏపీలో అనూహ్యంగా వైసీపీ ఓటమి పాలు అయింది. పైగా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు రాకపోవడంతో భారీ షాక్ కి గురి అవుతున్నారు నేతలు. చాలా మంది నేతలు మౌనంగా ఉంటూనే తమకు దగ్గర దారులు ఏమిటి అని ఆలోచిస్తున్నారు.
విజయనగరానికి చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జనసేన లోకి జంప్ చేస్తారు అని ప్రచారం ఊపందుకుంది. ఆయన నేరుగా టీడీపీలోకి వెళ్లలేరు. పైగా అక్కడ సమ ఉజ్జీ నేతలతో ఫుల్ రష్ గా ఉంది.
దాంతో జనసేనలో చేరితో విజయనగరం జిల్లాలో తన చక్రం తిప్పవచ్చు అని ఆయన తలపోస్తున్నారు అని అంటున్నారు. దాని కంటే ఎక్కువగా ఆయన మీద అవినీతి ఆరోపణలను టీడీపీ చేస్తూ వస్తోంది. విద్యాశాఖ మంత్రిగా ఆయన 65 కోట్ల రూపాయల అవినీతి చేశారు అని ఏసీబీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ఒక్కో ఉపాధ్యాయుడు నుంచి బదిలీల విషయంలో మూడు లక్షల నుంచి మొదలుపెట్టి ఆరు లక్షల రూపాయల దాకా వసూలు చేశారు అని టీడీపీ నేతలు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దాంతో బొత్సని లక్ష్యంగా చేసుకుని టీడీపీ పావులు కదుపుతోంది అని అంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా బొత్సనే గట్టిగా టార్గెట్ చేసారు. ఈ పరిణామాల నేపధ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న జనసేనలో చేరితే రిలీఫ్ గా ఉండొచ్చు అని బొత్స ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
అయితే బొత్స తాడేపల్లి వెళ్ళి జగన్ ని కూడా కలిసారు. వైసీపీ ఎందుకు ఓటమి పాలు అయింది అని జగన్ నిర్వహిస్తున్న సమీక్షలోనూ ఆయన పాల్గొన్నారు. బొత్స పార్టీ మారడం ఖాయం అని ఒక వైపు ప్రచారం సాగుతూంటే ఆయన జగన్ తో భేటీ కావడం కూడా ఆసక్తికరంగా ఉంది.
రాజకీయాల్లో ఇలా భేటీ అయి అలా పార్టీ జెండా ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి బొత్స వంటి వారు పవన్ శరణం గత్యామీ అంటూ జనసేన గూటిలోకి చేరే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటున్నారు. అయితే తాము వైసీపీ నేతలను తీసుకోమని మిత్ర పక్షాలు తీసుకోవద్దని టీడీపీ కోరుతోంది. కానీ ఆ జనసేన బీజేపీ తమ పార్టీలను విస్తరించుకునే పనిలో ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్రా రాజకీయం రసవత్తరంగా మారే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.