దేశవిదేశీ ప్రముఖులు హాజరైన కార్యక్రమం అది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగింది. చీమ చిటుక్కుమన్నా భద్రతా సిబ్బంది అప్రమత్తమవుతారు. అలాంటి సున్నితమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక వెనక నుంచి ఓ జంతువు సంచరించింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అప్పటికే మోదీ ప్రమాణ స్వీకారం పూర్తయింది. మూడోసారి ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మిగతా మంత్రుల ప్రమాణం జరుగుతోంది. బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణ స్వీకారం ముగిసింది. అప్పుడే వెనక నుంచి ఓ జంతువు కదలాడింది.
ప్రారంభంలో దీన్ని చాలామంది మార్ఫింగా అనుకున్నారు. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటివి సర్వసాధారణమని కొట్టిపారేశారు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన వీడియోలో కూడా ఇలానే ఉంది. దీంతో ఇది మార్ఫింగ్ కాదని, నిజంగానే ఓ జంతువు సంచరించిందనే విషయం బాహ్య ప్రపంచానికి తెలిసొచ్చింది.
దాని తోక, నడిచే విధానం చూసి చాలామంది అది చిరుతపులి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం అది పిల్లి లేదా కుక్క అయి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. సామాజిక మాధ్యమాలు, మీడియా ఛానెళ్లలో చెబుతున్నట్టు అది క్రూర మృగం కాదని ప్రకటించారు.
అయితే ఈ ప్రకటనలోనే ఢిల్లీ పోలీసులు తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టయింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా వేదిక వెనక వైపు ఓ జంతువు వచ్చిందంటే, అది భద్రతా వైఫల్యమే. అది క్రూరమృగం కాకపోయి ఉండొచ్చు, ఓ కుక్క అయి ఉండొచ్చు. అయినప్పటికీ అది వైఫల్యం కిందే లెక్క.
విదేశీ ప్రముఖులతో పాటు 8వేల మంది అతిథులు పాల్గొన్న ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భద్రతా వైఫల్యం బయటపడింది.