Advertisement

Advertisement


Home > Movies - Movie News

భారతీయ సినిమాకు అడ్రస్ సౌత్ కు మారుతోంది!

 భారతీయ సినిమాకు అడ్రస్ సౌత్ కు మారుతోంది!

ఎనభైలలో సౌత్ సినిమాలకు బాలీవుడ్ ఎంత గిరాకీ కనిపించిందో.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చినట్టుగా ఉంది! తొంభైలలో బాలీవుడ్ ఒక వెలుగు వెలిగింది. భారతీయ సినిమాకు కేరాఫ్ గా మారింది. రెండు వేలు దశకంలో కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. రెండు వేల దశకం రెండో దశాబ్దం పూర్తవుతున్న దశలో బాలీవుడ్ గమనం మళ్లీ మారింది.

అక్కడ స్టార్ హీరోలు సరైన సినిమాలను తీయలేకపోతున్నారు. కమర్షియల్ గా అవి హిట్ అయితే అవుతుండవచ్చు గాక.. అయితే యావత్ ఇండియాను శాసించేంత స్థాయిలో మాత్రం అక్కడి సినిమాలు రావడం లేదు. బహుశా ‘దంగల్’ కు వెనుకా ముందు.. ఏ సినిమా కూడా ఇండియాను మొత్తం ప్రభావితం చేయలేకపోయింది. దేశభక్తి, భారీ సినిమాలు వచ్చినా.. అంతకన్నా మెరుగైన సినిమాలు సౌత్ లో కూడా వస్తూ ఉన్నాయి.

ఇటీవలే వచ్చిన తెలుగు సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ గురించి ఒక బాలీవుడ్ విశ్లేషకుడు రాస్తూ రాస్తూ.. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో గనుక ‘సైరా’ లోలాంటి ఫీల్ ఉండి ఉంటే.. ఆ అమిర్ ఖాన్ సినిమా సూపర్ హిట్ అయ్యేదన్నాడు! ఇలా సౌత్ సినిమాలతో పోల్చి బాలీవుడ్ జనాలు అక్కడి సినిమాలను విశ్లేషించే పరిస్థితి వచ్చింది. ఇక సౌత్ లో ఏ సినిమా హిట్ అవుతుందా, ఏ సినిమాను రీమేక్ చేద్దామా… అన్నట్టుగా బాలీవుడ్ వాళ్లు ఇటు వైపు చూస్తూ ఉన్నారు.

ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం.. బాలీవుడ్ స్టార్ హీరోలు అంత ఫామ్ లో లేకపోవడం. షారూక్ ఖాన్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. 90లలో బాలీవుడ్ హీరోలు యావత్ ఇండియాలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో షారూక్ ఒకరు. అప్పుడు వచ్చిన షారూక్ సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. అయితే క్రమక్రమంగా అతడి సినిమాల్లోనూ స్థాయి తగ్గిపోయింది. ‘చక్ దే ఇండియా’, ‘ఓంశాంతి ఓం’ సినిమాల తర్వాత ఇండియాను మొత్తం ఊపేసిన షారూక్ సినిమాలు ఏవీ రాలేదనే చెప్పాలి.

సల్మాన్ పరిస్థితి కూడా అంతే. 90 లలో సల్మాన్ దక్షిణాదిన కూడా తన ముద్రను గట్టిగా వేశాడు. ఇక్కడి  వారికి కూడా క్రేజీ హీరోగా మారాడు. ‘ప్రేమపావురాలు’ ‘ప్రేమాలయం’ అంటూ సల్మాన్ సౌత్ ఫ్యాన్స్ మదిలో కూడా  తిష్ట వేశాడు. సల్మాన్ సినిమాల్లో ఆఖరుగా సౌత్ లో బాగా గుర్తింపుకు నోచుకున్న సినిమాలు ‘పార్ట్ నర్’, ‘దబంగ్’ లు. ‘భజరంగీ భాయ్ జాన్’ కొంత వరకూ ఫర్వాలేదనిపించుకుంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ కొన్ని కమర్షియల్ హిట్స్ కొట్టినా.. అవి సినిమాలుగా అంత ప్రశంసలు అందుకునేంత స్థాయిలో లేవు. వాటిల్లో కూడా కొన్ని సౌత్ రీమేక్ లున్నాయి.

‘బాడీగార్డ్’, ‘రెడీ’, ‘కిక్’ వంటి సినిమాలను రీమేక్ చేశాడు సల్మాన్. అవన్నీ సౌత్ వారిని ఆల్రెడీ ఆకట్టుకున్న సినిమాలే కావడంతో.. వాటి ప్రభావం మళ్లీ ఏమీ లేనట్టే. గత కొన్నేళ్లలో బాలీవుడ్ పరువును అంతో ఇంతో నిలబెట్టాడు ‘దంగల్’ హీరో ఆమీర్. అయితే ‘దంగల్’ తో వచ్చిన పేరు ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ‘తో పోయినంత పని అయ్యింది.  దశాబ్దాలుగా భారతీయ సినిమా అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి కొనసాగింది. బాలీవుడ్ క్లాసిక్స్ అంటే ఇతర భాషల వాళ్లు కూడా ఏదో ప్రేమతో చూశారు.

అయితే చిన్న సినిమాలు, ఆర్ట్ సినిమాలు కూడా మాయ చేయడం బాగా తగ్గిపోయింది. 'ఆషికీ 2' తర్వాత బాలీవుడ్ చిన్న సినిమాలు కూడా బయట పెద్దగా ఆడటం లేదు. దీంతో బాలీవుడ్ ప్రభావం చాలా వరకూ ఇతర భాషల ప్రేక్షకుల మీద తగ్గిపోతూ ఉంది. ఇదే సమయంలో సౌత్ సినిమాలు, మరాఠీ సినిమాలు మెరుపులు మెరిపిస్తున్నాయి. మరాఠీ ‘సైరట్’ , తెలుగు ‘అర్జున్ రెడ్డి’, మలయాళీ ‘ప్రేమమ్’ వీటితో పాటు తమిళ సినిమాలు.. అడపాదడపా..  ఇండియాను మొత్తం ప్రభావితం చేసేంత స్థాయికి వెళ్లిపోతూ ఉన్నాయి.

గతంలో ఇండియాను మొత్తం ప్రభావితం చేయాలంటే.. అది హిందీ సినిమాకే సాధ్యం అనే పరిస్థితి ఉండేది. దాదాపు 15 యేళ్ల కిందటి నుంచి ఆ పరిస్థితి మారుతూ వస్తోంది. తమిళంలో బాల రూపొందించిన ‘పితామగన్’ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకూ వెళ్లిపోయింది! ఆ రూరల్ డ్రామా విస్మయపరిచింది. విశ్లేషకులకు పని కల్పించింది. ఎప్పుడో ఎనభైలలో సౌత్ లో కొందరు దర్శకులు రూపొందించిన సినిమాలను బాలీవుడ్ కూడా కళ్లకు అద్దుకుంది. తొంభైలలో ఆ పరిస్థితి రివర్స్ అయ్యింది.

బాలీవుడ్ సినిమాలు సౌత్ ను శాసించాయి. బాలీవుడ్ నైన్టీస్ స్టార్ హీరోలంతా సౌత్ లో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఎనభైలలో సౌత్ లో వెలిగిన కమల్ హాసన్, రజనీకాంత్  వంటి వాళ్లు హిందీలో కూడా తమకంటూ గుర్తింపును సంపాదించుకుంటే, తొంభైల బాలీవుడ్ హీరోలు మాత్రం సౌత్ లో జెండా పాతారు. సౌత్ లో తొంభైలలో వెలిగిన హీరోలెవ్వరూ బాలీవుడ్ ను టచ్ చేయలేకపోయారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ ను ఏ మాత్రం మెప్పించలేకపోతూ ఉండటాన్ని గమనించవచ్చు.

రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్… వంటి వాళ్లకు సౌత్ లో ఉన్న గుర్తింపు ఏపాటిది? వాళ్లను ఎంతమంది సౌతిండియన్లు గుర్తిస్తారు? బాలీవుడ్ హీరోలను సౌత్ జనాలు ఎంతో కొంత గుర్తు పెట్టుకోవడం బహుశా హృతిక్ రోషన్ తోనే ఆగిపోయింది కాబోలు. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్లుగా ఎదిగిన వాళ్లను సౌత్ లోని సాధారణ సినీ ప్రేక్షకుడు గుర్తు కూడా పట్టలేడు! ఇదే సమయంలో సౌత్ యంగర్ జనరేషన్ హీరోలకు బాలీవుడ్ లో బ్రహ్మాండమైన గుర్తింపు వస్తోంది. ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి మ్యాన్లీ హీరోలకూ, ధనుష్ లాంటి యాక్టర్లకు బాలీవుడ్ లో గుర్తింపు దక్కింది.

1990 లలోని బాలీవుడ్ హీరోలు సౌత్ లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నారో, కుర్రతరం గుండెల్లో వాళ్లు ఎలా నిదురపోయారో.. ఇప్పుడు సౌత్ హీరోలు బాలీవుడ్ కుర్రతరం గుండెల్లో అలానే పాగా వేస్తూ ఉన్నారు. ఇక దర్శకుల విషయంలో కూడా సౌత్ వాళ్ల హవా మొదలైంది. శంకర్, ఎస్ఎస్ రాజమౌళి వంటి భారీ సినిమాల దర్శకులకు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. శంకర్ గత రెండు దశాబ్దాల్లో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి టైమ్ స్టార్ట్ అయ్యింది.

ఇక సందీప్ రెడ్డి వంగా వంటి వాళ్లు బాలీవుడ్ కు ఇష్టులయ్యారు. ఒకే సినిమాతో వీరు మంచి గుర్తింపును సంపాదించేసుకున్నారు. ఇక హిట్ల  కోసం వేచి ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోలు కనీసం సౌత్ దర్శకులు అయినా తమ కెరీర్ ను గాడిన పెడతారేమో అనే ఆశలతో ఇటు వైపు చూస్తున్నారు. సౌత్ సినిమాలను రీమేక్ చేయడానికి, సౌత్ దర్శకులతో సినిమాలు రూపొందించుకోవడానికి వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక సౌత్ సినిమాలు హిందీ జనాలను కట్టిపడేస్తున్న మరో వైనం డిజిటల్ మార్కెట్ లో కొనసాగుతూ ఉంది.

దక్షిణాదిన వచ్చే చిన్న చిన్న సినిమాలు కూడా హిందీలోకి అనువాదం అయ్యి యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ పొందుతూ ఉన్నాయి. తెలుగు వాళ్లు తిరస్కరించిన సినిమాలు కూడా హిందీలోకి అనువాదం అయ్యి మిలియన్స్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యూస్ ను పొందుతూ ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా ఫాలోయింగ్ మార్కెటింగ్ విషయంలో సౌత్ సినిమాలకు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే.. భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాకు మారుతోందని చెప్పవచ్చు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?