మాయా మశ్చీంద్ర పాట వస్తే ఆ మ్యూజిక్ కు తగ్గట్టు అప్పట్లో కుర్రాళ్లు చిందేశారు.. పచ్చని చిలుకలు తోడుంటే పాట విని మైమరిచిపోయారు. అదిరేటి డ్రెస్ మేమేస్తే అంటూ ఊర్మిళ రాగానే ఊగిపోయారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాలో పాటలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సాంగ్స్ తో ఒక్కసారిగా దేశం మార్మోగిపోయింది.
మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. కమల్ హాసన్ తో సేనాపతి గెటప్ ను బాగానే రీక్రియేట్ చేశాడు శంకర్. అదే టైమ్ లో అనిరుధ్ తో అప్పటి పాటల మేజిక్ ను మాత్రం పునరావృతం చేయలేకపోతున్నాడు.
భారతీయుడు-2 నుంచి ఇప్పటికి 2 పాటలొచ్చాయి. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అంతే తప్ప ఊపేసేలా లేవు. ‘శౌర’ అంటూ మొదటి పాట వచ్చింది. వారమైనా 2 మిలియన్ వ్యూస్ దాటలేదు. తాజాగా ‘చెంగళువ’ లిరిక్స్ తో మరో పాట వచ్చింది. ఇది విన్న తర్వాత మొదటి పాటే నయం అనిపించింది.
ఇలా సాగుతోంది భారతీయుడు-2 పాటల ప్రస్థానం. సినిమాకు హైప్ రావాలంటే కచ్చితంగా ఒక్క సాంగ్ అయినా వైరల్ అవ్వాలి. సాధారణంగా మంచి పాటలే ముందు రిలీజ్ చేస్తారు. ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే, భారతీయుడు-2 నుంచి మంచి వైరల్ సాంగ్ ఇక రాదనే అనుకోవాలి.
శంకర్ దర్శకత్వంలో, కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జులై 12న థియేటర్లలోకి వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈరోజు రిలీజైన పాట సినిమాలో సిద్దార్థ్-రకుల్ పై వస్తుంది.