ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది వైసీపీ అతి చేష్టలు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వారి విమర్శలను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. తమకు ధీమా ఉంది కాబట్టే ముహూర్తం ప్రకటించామని జూన్ 9న ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి బాధ్యతలు తీసుకుంటారు అని అంటున్నారు. విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణం అన్నది ఖరారు అయింది. అయితే ఎక్కడ వేదిక అన్న దాని మీద వైసీపీలో మళ్లీ డిస్కషన్ సాగుతోంది. పార్టీలోని నేతలే వర్గాలుగా మారి ఫలానా చోటనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ సౌత్ లో ఉన్న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో సీఎం జగన్ ప్రమాణం చేయాలని ఒక వర్గం పట్టుబడుతోంది. మరో వర్గం విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో చేయమంటోంది. ఇంకో వర్గం అయితే భీమిలీ పరిధిలోకి వచ్చే మధురవాడలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియం వేదికగా జగన్ ప్రమాణ స్వీకారం జరగాల్సిందే అని పట్టు బడుతోంది.
దీంతో వేదిక ఎక్కడా అన్నది ఇపుడు పార్టీలో తేలని వ్యవహారంగా ఉందిట. వీటికి అదనం అన్నట్లుగా జూన్ తొమ్మిదిన మెనూ కూడా రెడీ చేస్తున్నారు. సీఎం ప్రమాణస్వీకారోత్సవం కమిటీలో ఆహార విభాగం కూడా ఏర్పాటు అయింది.
జూన్ 9న అదిరిపోయే వంటకాలను మెనూలో చేర్చారు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ లో మసాలా ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహోర, పెరుగు వడ, మసాలా దోశ, చాక్లెట్ దోశ, చక్కెర పొంగలి, పాయసం, పోహా వేపుడు, బొబ్బట్టు, పునుగులు వంటివి ఉంటాయి.
ఇక నాన్ వెజ్ లో బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో చికెన్ పెసరట్టు, ఎగ్ దోశ, చికెన్ దోశ, మటన్ ఖీమా దోశ, ఎగ్ బుర్జీ విత్ పావ్, మటన్ కీమా, ఇడ్లీ, చికెన్ పొంగల్, అరెసలు బోటీ వడ, నాటు కోడి పులుసు. పెసర పునుగులు, మద్రాస్ ఫిల్టర్ కాఫీ వంటివి ఉన్నాయి.
ఇక మధ్యాహ్నం లంచ్ లో వెజిటేరియన్స్ కోసం గోంగూర పప్పు, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడి కాయ పప్పు, వెజిటబుల్ బిర్యానీ వంటివి ఉంటే నాన్ వెజ్ లంచ్ లో ఆంధ్రా చికెన్ కరీ, మటన్ పలావ్, చేపల పులుసు. బొమ్మిడాల పులుసు. నాటు కోడి వేపుడు, ఇలా చాలా ఐటమ్స్ నే పెట్టారు. ఇదిపుడు తెగ వైరల్ అవుతోంది. జూన్ 9న జగన్ ప్రమాణం స్వీకారం అన్నది సూర్యుడు అటు నుంచి పొడిచినా తధ్యమని వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు