గోపీచంద్ హీరో గా ఈ వారం విడుదలవుతున్న సినిమా భీమా. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాను రూపొందించారు. రాధామోహన్ నిర్మాత. తెలుగులో బోయపాటి అందించే మాస్ యాక్షన్ టైపు సినిమా ఇది. పైగా చిన్న మైథలాజికల్ టచ్. సినిమా లో భారీ యాక్షన్ సీన్లు వున్నాయి. కాస్త రక్తపాతం కూడా. ఈ సినిమా నిడివి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు. ఈ సినిమాకు సెన్సారు అధికారులు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇక్కడ విషయం ఏమిటంటే య/ఎ సర్టిఫికెట్ కావాలంటే బోలెడు కట్ లు, కొన్ని మ్యూట్ లు చెప్పారట. లేదూ అంటే సింగిల్ వర్డ్ మ్యూట్ చేస్తే చాలు ఎ సర్టిఫికెట్ ఇస్తామన్నారట. దాంతో నిర్మాత, దర్శకుడు అంతా ఎ సర్టిఫికెట్ వైపే మొగ్గారు.
ఎందుకంటే ఇంత భారీ యాక్షన్ సినిమాకు పిల్లలను ఎలాగూ తీసుకురారు. మాస్ మహా జన ప్రేక్షకులే ఈ సినిమాకు మహారాజ పోషకులు. అందువల్ల ఎ సర్టిఫికెట్ వచ్చినా పెద్ద సమస్య కాదని అలా డిసైడ్ అయ్యారట.
దాంతో ఓ చిన్న హిందీ తిట్టు పదం మ్యూట్ చేయించి ఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు. హీరో గోపీచంద్ ఈ సినిమా మీద చాలా నమ్మకంగా వున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చేసిన పోలీస్ పాత్ర, దాని వేరియేషన్లు తనకు పేరు తెస్తాయని నమ్ముతున్నారు. కన్నడ దర్శకుడు హర్ష ఫక్తు మాస్ యాక్షన్ సినిమాను అందించారు. అది ఎలా వచ్చిందో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.