షాకింగ్.. బెడిసికొట్టిన భీమ్లానాయక్

పెద్ద హీరోల సినిమాలు బుల్లితెరపై షాకిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిరంజీవికి సైరా, ప్రభాస్ కు సాహో, మహేష్ కు స్పైడర్ లాంటి సినిమాలు బుల్లితెరపై షాకిచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి పవన్ కల్యాణ్…

పెద్ద హీరోల సినిమాలు బుల్లితెరపై షాకిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిరంజీవికి సైరా, ప్రభాస్ కు సాహో, మహేష్ కు స్పైడర్ లాంటి సినిమాలు బుల్లితెరపై షాకిచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ తాజా చిత్రం కూడా చేరింది. పవన్ కల్యాణ్ నుంచి తాజాగా వచ్చిన భీమ్లానాయక్ సినిమా, బుల్లితెరపై చతికిలపడింది.

త్రివిక్రమ్ పర్యవేక్షణలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రానా కూడా ఉన్నాడు. పాటలు కూడా పెద్ద హిట్టయ్యాయి. దీంతో స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన భీమ్లానాయక్ సినిమాకు కేవలం 9 టీఆర్పీ వచ్చింది. కనీసం రెండంకెల రేటింగ్ కూడా రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు, సదరు ఛానెల్ కూడా షాక్ లో ఉంది.

వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఆ సినిమాను జీ తెలుగు ఛానెల్ లో తొలిసారి ప్రసారం చేస్తే ఏకంగా 19 టీఆర్పీ వచ్చింది. ఆ వెంటనే వచ్చిన భీమ్లానాయక్ సినిమాకు కేవలం 9 టీఆర్పీ రావడం ఆశ్చర్యం.

టీఆర్పీల్లో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు (23.4) సినిమాలు టాప్ లో ఉన్నాయి. పవన్ కల్యాణ్ కొత్త సినిమా టీవీల్లో వస్తే చాలు, ఈ రెండు సినిమాలతో కంపేర్ చేస్తుంటారు అతడి అభిమానులు. వకీల్ సాబ్ 20 మార్క్ టచ్ చేయలేకపోయినప్పుడు తెగ ఇదైపోయారు. అలాంటిప్పుడు భీమ్లానాయక్ సినిమా కనీసం 10 బెంచ్ మార్క్ కూడా అందుకోలేకపోయింది.