సీనియర్ నటి జీవితా రాజశేఖర్ తన బాధనంతా వెళ్లబోసుకున్నారు. గత 25 ఏళ్లుగా తాను అనుభవిస్తున్న బాధ అంతాఇందా కాదని ఆమె చెప్పుకొచ్చారు. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ చిత్రం ఈ నెల విడుదల కానుంది.
ఈ సినిమాకు జీవితా, రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మికా, అలాగే బీరం సుధాకర్‌రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జీవిత తమ కులాన్ని కించపరిచారంటూ ఆర్యవైశ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు జీవిత బహిరంగ క్షమాపణ చెప్పారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తానొకటి మాట్లాడితే ఇంకో విధంగా ప్రచారంలోకి వెళ్లిందన్నారు. ఆర్యవైశ్యుల మనసులను నొప్పించి వుంటే క్షమించాలని ఆమె వేడుకున్నారు. తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారంపై జీవితా రాజశేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబపై దుష్ప్రచారం జరుగుతున్నట్టుగా మరెవరిపైనా సాగడం లేదన్నారు. తమ కుమార్తెలపై తప్పుడు రాతలు ఎంతో ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. మొన్నా మధ్య తన కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారని వాపోయారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారని ఆవేదనతో చెప్పారామె.
ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్‌కు వెళ్లామన్నారు. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారన్నారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయన్నారు. ఎంతో కష్టపడి మనుగడ సాగిస్తున్నామన్నారు. తప్పు చేస్తే నడిరోడ్డుపై కొట్టాలని జీవితా రాజశేఖర్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలపై కోర్టుల చుట్టూ తిరిగే సమయం తనకు లేదన్నారు. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో నడుస్తుండగానే ఏవేవో రాస్తున్నారని చెప్పారు. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని జీవితా రాజశేఖర్ విజ్ఞప్తి చేయడం విశేషం.