భారీ ట్రోలింగ్.. ఆర్ఆర్ఆర్ పై వెనక్కు తగ్గిన జీ5

స్ట్రీమింగ్ కు రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. థియేటర్లలో 50 రోజుల పాటు నడిచిన ఈ సినిమాను, ఓటీటీలోకి తీసుకొస్తూ, మరోసారి ఛార్జీలు విధించడాన్ని నెటిజన్లు…

స్ట్రీమింగ్ కు రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. థియేటర్లలో 50 రోజుల పాటు నడిచిన ఈ సినిమాను, ఓటీటీలోకి తీసుకొస్తూ, మరోసారి ఛార్జీలు విధించడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. 

సబ్ స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చూడ్డానికి అదనంగా మరో 100 రూపాయలు ఛార్జ్ చేయడంపై భారీ ట్రోలింగ్ నడిచింది. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్ దెబ్బకు జీ గ్రూప్ దిగొచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాను పే-పర్-వ్యూ గా స్ట్రీమింగ్ చేసే విధానం నుంచి తప్పుకుంది. జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. కేవలం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. చందాదారులంతా ఉచితంగా జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడొచ్చు.

జీ5 ఏడాది సబ్ స్క్రిప్షన్ 599 రూపాయలు, ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే మరో వంద చెల్లించాలి. అంటే 699 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ ను ఇప్పుడు జీ5 రద్దు చేసింది. ఆల్రెడీ ఈ ప్లాన్ తీసుకున్నవాళ్లకు ఏడాది సబ్ స్క్రిప్షన్ తో పాటు, అదనంగా మరో 3 నెలలు సబ్ స్క్రిప్షన్ గడువును పెంచింది జీ5 సంస్థ.

ఈరోజు అర్థరాత్రి నుంచి జీ5లో ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. మంచి క్వాలిటీలో సినిమా చూడాలనుకునేవాళ్లకు 4కె రిజల్యూషన్ మోడ్ ను కూడా అందుబాటులో ఉంచింది.