ఫిబ్రవరి 25న శివరాత్రి కానుకగా భీమ్లానాయక్ ను విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అది కుదరకపోతే ఏప్రిల్ 1న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామంటూ 2 తేదీలు ప్రకటించారు. అయితే ఇప్పుడీ రెండు తేదీల్లో ఒక తేదీ నుంచి దాదాపు భీమ్లానాయక్ తప్పుకున్నట్టే. అదే ఫిబ్రవరి 25. అవును.. ఈ తేదీకి భీమ్లానాయక్ రాదు. ఈ విషయాన్ని మేకర్స్ కన్ ఫర్మ్ చేయలేదు కానీ గని యూనిట్ ప్రకటించింది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను ఆ తేదీకి సిద్ధం చేస్తే మాత్రం తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈరోజు గని మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా గని సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. సో.. ఆ తేదీకి భీమ్లానాయక్ రాదని నిర్థారించుకున్న తర్వాతే గని మేకర్స్ పోస్టర్ వేశారని అర్థం.
నిజానికి భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25కే రిలీజ్ చేస్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే, ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేశారు. ఆటోమేటిగ్గా సెకెండ్ షోలకు కూడా అనుమతి ఇచ్చేసినట్టే. కానీ భీమ్లానాయక్ యూనిట్ మాత్రం కొత్త టికెట్ రేట్ల జీవో కోసం ఎదురుచూస్తున్నట్టు అర్థమౌతోంది. అందుకే భీమ్లాను వాయిదా వేసినట్టు కనిపిస్తోంది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్, భీమ్లా మధ్య పోటీ నెలకొన్నట్టు అయింది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ వస్తే, కొన్ని రోజుల గ్యాప్ లోనే భీమ్లానాయక్ వస్తోంది. దీనిపై నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు కూడా. ఆర్ఆర్ఆర్ వచ్చిన వారం గ్యాప్ లో భీమ్లానాయక్ రావడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టంచేశాడు. సో.. భీమ్లానాయక్ ఏప్రిల్ 1 విడుదల అన్నమాట.