తెలంగాణలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బరి తెగించారు. జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాననే అహంకారం ఆయన మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజాసింగ్ సంచలన, అభ్యంతరకర హెచ్చరికలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికి రెండు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. ఇంకా ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి వుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. మొదటి, రెండో విడతల్లో జరిగిన పోలింగ్‌లో యోగికి బలమున్న చోట్ల తక్కువ ఓటింగ్, అలాగే వ్యతిరేకత ఉన్న చోట భారీ పోలింగ్ నమోదు కావడంతో బీజేపీలో భయం పట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓట్లు వేయడంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన ఏమన్నారో రాజాసింగ్ మాటల్లోనే తెలుసుకుందాం.
“ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి జైకొట్టాలి. మీరు ఆయనకు ఓటు వేసి తీరాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిఆదిత్యనాథ్ బుల్డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకో తెలుసా… ఒకవేళ ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం. అలాంటి ద్రోహులకు ఉత్తరప్రదేశ్‌లో స్థానం లేదు. కావున యోగిని సీఎంగా అంగీకరించని పక్షంలో, ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి, తరిమి తరిమి కొట్టి, మీ ఇళ్లను బుల్డోజర్లు, జేసీబీలతో కూల్చేస్తాం” అని రాజాసింగ్ సంచలన హెచ్చరికలు చేశారు.
రాజాసింగ్‌పై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అలాగే తన పార్టీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలపై బీజేపీ వైఖరి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజాసింగ్‌కు వివాదాలు కొత్తకాదు.