కర్నాటకలో హిజాబ్ వివాదం చోటు చేసుకోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల రగిలిపోయారు. నీచ రాజకీయాలుగా ఆమె అభివర్ణించారు. సామాజిక, రాజకీయ అంశాలపై గుత్తా జ్వాల నిర్భయంగా తన అభిప్రాయాల్ని వెల్లడిస్తుంటారు. ఈ సందర్భంగా పాలకులపై ధిక్కార స్వరాన్ని వినిపించడానికి కూడా ఆమె వెనుకాడని నైజాన్ని పలు సందర్భాల్లో చూశాం.
కర్నాటలో ముస్లిం విద్యార్థులు ఎప్పట్లాగే హిజాబ్ ధరించి చదువుకోడానికి వెళితే అభ్యంతరం చెప్పడం వివాదాస్పదమైంది. దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించడాన్ని ప్రజాస్వామిక, లౌకిక వాదులు తప్పు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా వివాదాన్ని సృష్టిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నాటకలో హిజాబ్ పరిణామాలపై గుత్తా జ్వాల తన మార్క్ స్పందన తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావిస్తారు. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అని గుత్తా జ్వాల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా మరోసారి తన సామాజిక స్పృహను గుత్తా వెల్లడించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.