తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలని కలలు కంటున్న వైఎస్ షర్మిల సంయమనం కోల్పోయారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో షర్మిల విమర్శలు పరిధులు దాటుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తానేం చేసినా అధికార పార్టీ పట్టించుకోకపోవడంతో, ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తున్నారనే భావన ఆమెను అసహనానికి గురి చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇవాళ కేసీఆర్పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం కేసీఆర్ బండ కట్టుకుని దేనిలోనైనా దూకితే నిరుద్యోగుల నెత్తిన పాలు పోసినట్టే అనే విమర్శ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే విమర్శ తన అన్న అయిన ఏపీ సీఎం జగన్పై ప్రత్యర్థులు చేస్తే అభిమానుల మనసు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి షర్మిల ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి గాలిలో వచ్చాడని, అదే గాలిలోనే కలిసిపోతాడని తీవ్ర విమర్శ చేశారు. జగన్ అంతాన్ని చంద్రబాబు కోరుకోవడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. మరి ఇప్పుడు కేసీఆర్పై షర్మిల విమర్శలు కూడా అలాంటివే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేయడాన్ని ఎవరైనా స్వాగతిస్తారని, కానీ పీడ పోతుందని కేసీఆర్ జీవితంపై హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదని పలువురు హితవు చెబుతున్నారు.
నిరుద్యోగులకు సంఘీభావంగా సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు నిరసస దీక్ష చేయనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల ఆవేశంగా మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దన్నారు. వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న లక్ష 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం బండకట్టుకొని దేనిలోనైనా దూకితే నిరుద్యోగుల నెత్తిన పాలు పోసినట్టే అని అనుచిత వ్యాఖ్య చేయడం వివాదాస్పదమైంది. దేశంలో నిరుద్యోగం కనిపించే కేసీఆర్కు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య కనిపించదా? అని ప్రశ్నించారు.