శ్రీరామనగరం అనగానే ఇదెక్కడ ఉంది అనే సందేహం రావొచ్చు. కానీ ముచ్చింతల్ అనగానే అర్ధమైపోతుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో త్రిదండి చినజీయర్ ఆశ్రమం ఉంది. నిన్నటివరకు అత్యంత వైభవంగా జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలతో ముచ్చింతల్ పేరు మారుమోగిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత భారీదైన 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఎందరో కేంద్రమంత్రులు, పలు రంగాల ప్రముఖులు శ్రీరామ నగరానికి వచ్చి, రామానుజచార్య విగ్రహాన్ని చూసి పులకించిపోయారు. కొన్ని రాజకీయ కారణాలతో, రామానుజాచార్య విగ్రహ శిలాఫలకం మీద తన పేరు లేకపోవడంతో ఆగ్రహించిన సీఎం కేసీఆర్ అక్కడ కార్యక్రమాలు పూర్తయ్యేవరకు ముచ్చింతల్ కు వెళ్లలేదనుకోండి, అది వేరే విషయం.
రామానుజాచార్యులు విగ్రహావిష్కరణ కార్యక్రమం కాస్తా బీజేపీ – టీఆర్ఎస్ మధ్య రాజకీయ దుమారం రేపింది. కేసీఆర్ వెళ్లని లోటు బాగా కనబడింది. కానీ శ్రీరామనగరంలో కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. నిన్న నిర్వహించాల్సిన శాంతి కళ్యాణం మాత్రం కొన్ని కారణాలతో వాయిదా పడింది. శ్రీరామ నగరాన్ని ఎందరో ప్రశంసించారు.
ఇది దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుందని అన్నారు. తెలంగాణకే కాదు దేశానికే తలమానికం అవుతుందని అన్నారు. మోడీ వచ్చి రాజకీయ వివాదం రేగకముందు కొందరు మంత్రులు కూడా చిన జీయర్ అత్యంత భారీ రామానుజ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ప్రశంసించారు. హైదరాబాద్ వచ్చినవారు శ్రీరామ నగరాన్ని తప్పక సందర్శిస్తారని అన్నారు.
నిజమే …ముచ్చింతల్ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అనడంలో సందేహం లేదు. మన దేశంలో చిన్న ఆలయాలు సైతం గొప్పగా పేరు తెచ్చుకున్నవి ఉన్నాయి. అలాంటిది ముచ్చింతల్ కు పేరు రావడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ప్రముఖులు మొదలుకొని సాధారణ ప్రజలు సైతం తండోపతండాలుగా ముచ్చింతల్ ను సందర్శించారు. రాబోయే రోజుల్లో ఇంకా …ఇంకా సందర్శిస్తారు.
సమతా మూర్తి దివ్యక్షేత్రం నిర్వహణ ఆషామాషీ వ్యవహారం కాదని చిన జీయర్ స్వామి అనుకున్నారేమో. అందుకే శ్రీరామ నగరాన్ని ఆధ్యాత్మిక క్షేత్రం కమ్ పర్యాటక ప్రాంతంగా మార్చారు . ఇకనుంచి శ్రీరామ నగరానికి వెళ్లి రామానుజుల విగ్రహాన్ని, అక్కడి 108 దివ్య దేశాలను చూడాలంటే రుసుము చెల్లించాలి. అంటే టిక్కెట్టు కొని లోపలికి వెళ్ళాలి. ఈ వారం నుంచే దీన్ని అమలు చేస్తున్నారు.
టిక్కెట్టు ధర పెద్దలకు వంద రూపాయలు. పిల్లలకు యాభై రూపాయలు. మన దేశంలో టిక్కెట్టు కొంటే తప్ప భగవంతుడిని చూసే అవకాశం లేదు. చిన్న ఆలయం నుంచి తిరుమల వరకు ఇదే పరిస్థితి. ఆలయాల నిర్వహణకు, ఇతర కార్యక్రమాలకు ఇలా చేయక తప్పదని కొందరు అంటుంటారు. పర్యాటక ప్రాంతాలను కూడా రుసుము చెల్లించి చూడాల్సిందే. అందుకే ఆధ్యాత్మిక క్షేత్రాలు లేదా పుణ్యక్షేత్రాలే పర్యాటక ప్రాంతాలు కూడా.